జిల్లాలో కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా తీవ్రతను తగ్గించేలా ప్రత్యేక కార్యచరణ, నినాదంలో ముందుకుకు వెళుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, రెస్టారెంట్లు, మాల్స్ లో మాస్కు లేనిదే లోపలికి అనుమతించకూడదని చెప్పారు. ఈ నిర్ణయం అమలయ్యేలా మున్సిపల్ కమిషనర్లు, జెడ్పీ సీఈవో నోడల్ అధికారులుగా పర్యవేక్షిస్తారన్నారు.
ప్రతి మంగళవారం 'నో మాస్క్ నో రైడ్స్' అనే నినాదంతో ఆటోలు, బస్సులు, టాక్సీలు, అన్ని వాహనాల్లో మాస్కు ఉంటేనే ప్రయాణానికి అనుమతించేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. రవాణాశాఖ అధికారులు ఆర్టీసీ అధికారులు ఈ నిబంధన ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని కలెక్టర్ చెప్పారు. ప్రతి బుధవారం 'నో మాస్క్ నో సేల్' అనే నినాదంతో మాస్క్ పెట్టుకోని వారికి ఏ వస్తువులూ విక్రయించరాదని ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మాస్కు ధరించడం ఒక్కటే కరోనాను సమర్థంగా ఎదుర్కోవటానికి మార్గమని కలెక్టర్ చెప్పారు.
'నో మాస్క్ నో ఎంట్రీ' అనే నిర్ణయాన్ని సమర్థంగా అమలు చేయడంలో పోలీసు శాఖ పూర్తిస్థాయిలో బాధ్యత నిర్వహిస్తుందని జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ చెప్పారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఇప్పటివరకు కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన 17,500 వాహనాలను సీజ్ చేశామని, రూ.28,265 చాలానా విధించామని తెలిపారు. ఈ క్రమంలో 2603 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. అత్యవసరమైతే తప్ప కర్ఫ్యూ అమలులో ఉన్న సమయంలో బయటకు రావద్దని ప్రజలకు ఆయన సూచించారు. కరోనా బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసే పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు.
ఇదీ చదవండి:
Bankers Meeting: రైతులకు అధికంగా రుణాలు ఇవ్వండి: ప్రకాశం కలెక్టర్