రేషన్ సరుకుల డోర్ డెలివరీకి రాయితీపై అందించే వాహనాల కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఎంపిక చేపట్టాలని సూచించారు. వాహనాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ధ్రువపత్రాల పరిశీలన, ఎంపిక ప్రక్రియను ఒంగోలులోని వెలుగు టీటీడీసీ కార్యాలయంలో కలెక్టర్ ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లబ్ధిదారులను త్వరగా ఎంపిక చేసి..యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పరిశీలన ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లా అధికారులు కచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 589 మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. తొలి రోజైన శుక్రవారం కొత్తపట్నం, నాగులుప్పలపాడు, ఒంగోలు అర్బన్, రూరల్, మద్దిపాడు, సంతనూతలపాడు మండలాలకు చెందిన 83 మంది దరఖాస్తుదారులను ధ్రువపత్రాల పరిశీలన నిమిత్తం ఆహ్వానించామన్నారు. ఆయా మండలాలకు మ్యాపింగ్ చేసిన బ్యాంకు అధికారులు వీరి సర్టిఫికెట్లను పరిశీలిస్తారని కలెక్టర్ వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ఉన్నతాధికారులు ఈ ప్రక్రియను సమన్వయం చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీచదవండి