ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ దగ్గర ఉండే పాకాల బీచ్, ఒంగోలు శివారులోని కొత్తపట్నం బీచ్, చీరాల ఓడరేవు బీచ్, వేటపాలెం, రామాపురం బీచ్‌ల్లో పర్యాటకుల సందడిపెరుగుతోంది. కరోనా వల్ల ఏడాది కాలంగా వెలవెలబోయిన ఈ బీచ్‌లలో.. పర్యాటకుల సందడి ఎక్కువైంది. రవితేజ క్రాక్ సినిమా తర్వాత వేటపాలెం, రామాపురం బీచ్‌లకు ఆదరణ పెరిగింది. వారాంతాలు, సెలవు రోజుల్లో ఈ బీచ్‌లు జనంతో కళకళ లాడుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలు, హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు.
చీరాల వాడరేవు నుంచి రామాపురం, కటారిపాలెం వరకు పర్యాటకంగా అనుకూలంగా ఉన్నాయి. పర్యాటకుల కోసం కొన్ని ప్రైవేట్ వసతిగృహాలు అందుబాటులోకి వచ్చాయి. శని, ఆదివారాల్లో అక్కడ వసతి దొరకడం కూడా కష్టమవుతోంది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, నెల్లూరు ప్రాంతాల్లో నుంచి పర్యాటకులు తమ కుటుంబాలతో కలిసి ఇక్కడ సేద తీరడానికి వస్తున్నారు.
పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నా..సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. మెరైన్ పోలీసుల గస్తీ లేకపోవడం, ప్రమాదకరమైన ప్రాంతాలను సూచించే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంపై పర్యాటకులు పెదవి విరుస్తున్నారు. ఈ బీచ్‌లను మరింత అభివృద్ధి చేస్తే.. పర్యాటకుల సంఖ్య ఇంకా పెరుగుతుందని స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: