TDP MLA Yeluri Sambasiva Rao: అగ్రిగోల్డ్ బాధితుల సొమ్ము దారి మళ్లించిన జగన్ రెడ్డి.. మార్గదర్శిపై కక్ష సాధించడం హాస్యాస్పదంగా ఉందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ఒక్క ఖాతాదారుడూ ఫిర్యాదు చేయని మార్గదర్శిపై సోదాలు, అరెస్టులు చేయడం జగన్ రెడ్డి మార్క్ రాజకీయానికి నిదర్శనం అంటూ ఏలూరి సాంబశివరావు విమర్శించారు.
ఏసీబీ, జేసీబీ, పీసీబీ పాలన: అగ్రిగోల్డ్ బాధితుల సొమ్ము దారి మళ్లించిన జగన్ రెడ్డి మార్గదర్శిపై కక్షసాధించడం హాస్యాస్పదమని పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు ధ్వజమెత్తారు. ఒక్క ఖాతాదారుడూ ఫిర్యాదు చేయని మార్గదర్శిపై సోదాలు, అరెస్టులు చేయడం జగన్ రెడ్డి మార్క్ రాజకీయానికి నిదర్శనమని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఈనాడు గళమెత్తినందుకే జగన్ అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏసీబీ, జేసీబీ, పీసీబీ పాలన నడుస్తోందనడానికి ఇదే నిదర్శనమని దుయ్యబట్టారు. సీఐడీని అడ్డుపెట్టుకుని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
రూల్స్‌కు విరుద్ధంగా: మార్గదర్శిని కుప్పకూల్చడం ద్వారా ఈనాడు ఆర్థిక మూలాలను దెబ్బతీయొచ్చని జగన్ రెడ్డి కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. గడువు ముగిశాకే డబ్బులు తిరిగి తీసుకుంటామని ఖాతాదారులు కుండబద్దలు కొడుతున్నా.. జగన్ రెడ్డి అండ్ కోకు సిగ్గు రావడంలేదని ధ్వజమెత్తారు. ఒక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకుని మరీ మార్గదర్శి ఖాతాదారులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని మండిపడ్డారు. సోదాల పేరుతో మార్గదర్శి కార్యాలయాల్లో విలువైన డాక్యుమెంట్లు తరలించారని ఆరోపించారు. పాలకులకు అధికారులు గుడ్డిగా వంత పాడుతున్నారని విమర్శించారు. సీఐడీ అయినా ఏసీబీ అయినా రూల్స్‌కు విరుద్ధంగా జగన్ రెడ్డి చెప్పిన విధంగా తలాడిస్తున్నందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా రూల్స్ అతిక్రమించి వ్యవహరిస్తున్న అధికారులు శిక్షార్హులే అన్న విషయం సీఐడీ గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు.
నక్కా ఆనంద్ బాబు : అమరావతి నిర్మాణం ఆపేసి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ నిర్వహిస్తున్న సామాజికన్యాయ చైతన్యయాత్రలో ఆయన పాల్గొన్నారు. తాడికొండ మండలం రావెలలో జరిగిన పాదయాత్రలో పాల్గొన్న నక్కా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల ముందు ఓ మాట, గెలిచిన తర్వాత ఓ మాట మాట్లాడిన జగన్ అమరావతికి భూములిచ్చిన రైతుల్ని నట్టేట ముంచారని ఆరోపించారు. కోడికత్తి డ్రామాలు, గొడ్డలి పోట్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజలు జగన్‌ను నమ్మే పరిస్థితి లేదని నక్కా ఆనంద్ బాబు అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి: