water problem in ongole : జిల్లా కేంద్రం.. కార్పొరేషన్ స్థాయి నగరం.. అయినా అన్నీ సమస్యలే. అక్కడ తాగునీరు సరఫరా చేయడానికి కూడా నగరపాలక సంస్థ ఆపసోపాలు పడుతోంది. కాలనీలు విస్తరిస్తున్నా.. కనీస అవసరమైన తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేయడంలో విఫలమవుతోంది. ఎన్నోఏళ్లుగా నీటి కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇదీ.. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కాలనీ వాసుల పరిస్థితి.
ప్రకాశం జిల్లా ఒంగోలులో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగునీటి సౌకర్యాలు పెరగడం లేదు. వీధి కుళాయిల కోసం ఎన్నోఏళ్ల నుంచి అభ్యర్థిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. నేతాజీ నగర్, జయప్రకాశ్ నగర్, పీర్లమాన్యం, అరుణోదయ కాలనీ తదితర ప్రాంతాలకు వీధి కుళాయిలు లేవు. ఎప్పుడో వేసిన గొట్టపు బావుల్లో ఒకటో రెండో మినహా, ఏవీ పనిచేయవు. భూగర్భ జలం ఉప్పునీరు కావడం వల్ల బోర్లు కూడా వేయడం లేదు. గతంలో ఈ కాలనీల కోసం రక్షిత మంచినీటి పథకాలు ఏర్పాటు చేసి, వీధి కుళాయిల కోసం పైపులు వేసినా కనెక్షన్లు ఇవ్వడంలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆయా కాలనీ వాసులకు ట్యాంకుల ద్వారా తాగునీరు సరఫరా చేస్తారు. అదీ వారానికి ఒకసారి మాత్రమే ట్యాంకులు వస్తాయి. ఈ నీటినే పెద్ద పెద్ద డ్రమ్ముల్లో పట్టుకొని జాగ్రత్తగా వాడుకోవాలి. తాగు నీటిని నిత్యం కొనుగోలు చేయాల్సి వస్తోందని కాలనీ వాసులు వాపోతున్నారు. తాగునీటి కోసం తిప్పలు పడుతున్నా నగర పాలక సంస్థ పట్టించుకోకపోవడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
భార్య, భర్త ఉన్నోళ్లకు మాత్రమే నీళ్లు సరిపోతున్నయి. నలుగురు కుటుంబ సభ్యులుంటే మాత్రం అస్సలు సరిపోవడం లేదు. ఐదు రోజులకోసారి నీళ్లు వస్తున్నయి.. ట్యాంకర్లతో తెచ్చి పోస్తున్నరు.. నలుగురికి ఒక డ్రమ్ము వస్తయి.. వాటినే సర్దుకుని వాడుకుంటున్నం.. ఎండాకాలం వస్తే నీళ్లకు చాలా ఇబ్బంది. కాలనీ దగ్గర్లో బోరు వేయిస్తే ఇబ్బంది లేకుండా బాగుంటది. - రమణమ్మ, సుబ్బులు, ఒంగోలు, జయ
ఈ కాలనీ వాసులకు ట్యాంకుల ద్వారా తాగునీటి సరఫరా చేస్తారు... అదీ వారానికి ఒక సారి మాత్రమే ట్యాంకులు వస్తాయి... ఈ నీళ్ళే పెద్ద పెద్ద డ్రమ్ముల్లో పట్టుకొని జాగ్రత్తగా వాడుకుంటున్నాం... ఈ నీళ్ళు కూడా ఇంటికి పరిమితంగానే సరఫరా చేస్తున్నారు... తాగునీరు లేక కొందరు పట్టణంలో ఇతర ప్రాంతాలనుంచి బళ్ళతో నీటిని తెచ్చి విక్రయిస్తున్నారు. - రమణమ్మ, కొండా తిరుపతమ్మ, సరస్వతి, సుజాత
గత ప్రభుత్వం హయంలో అమృత పథకం ద్వారా శాశ్వత మంచినీటి పథకానికి రూ.125 కోట్లు మంజూరయ్యాయి. 90 శాతం పనులు పూర్తి చేశారు. గుండ్లకమ్మనుంచి ప్రధాన పైపులైన్ లో రెండు కిలోమీటర్ల పైపు లైన్ నిర్మాణం , రక్షిత మంచినీటి పథకాలకు అనుసంధాన పనులు మాత్రమే ఉన్నాయి. వాటిలి పక్కన పెట్టి ఇటీవల కొత్తగా అమృత పథకం-2 లో రూ.339 కోట్లు మూంజూరు చేయిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఉన్న పథకాన్ని పూర్తి చేయకుండా, కొత్త పథకం మంజూరు చేస్తున్నట్లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. - దామచర్ల జనార్దన్, మాజీ ఎమ్మెల్యే
ఇవీ చదవండి :