ప్రకాశం జిల్లా మిరప రైతులపై ప్రకృతి కన్నెర్ర చేస్తోంది. ఈ ఏడాది మంచి లాభాలతో గట్టెక్కుతామన్న ఆశలపై వర్షం నీళ్లు చల్లింది. సీజన్ ప్రారంభంలో క్వింటా మిరప 14 నుంచి 15 వేల రూపాయల వరకూ పలికింది. ఆ ధర నిలకడగా ఉంటుందన్న ఆశతో జిల్లాలో సుమారు లక్షా 20వేల ఎకరాల్లో మిరప సాగు చేశారు. అకాల వర్షాలతో మొదటిసారి నారుమళ్లు నీటమునిగితే, రెండోసారీ వేశారు. కోత సమయంలోనూ మళ్లీ వర్షాలు కురిశాయి. అప్పుడూ నష్టాలే మిగిలాయి. కొన్నిచోట్ల మార్చి నుంచి కోతలు ప్రారంభం అయ్యాయి. 2 కోతలు పూర్తికాగానే... ఉప్పెనలా వచ్చిన కరోనా మహమ్మారి రైతులను కష్టాల్లో నెట్టింది. లాక్‌డౌన్‌తో కూలీల కొరత, మార్కెటింగ్ సమస్యలు నష్టాలను పెంచుతూనే పోతున్నాయి.
కల్లాల్లో కన్నీళ్లు
కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో.. లాక్‌డౌన్ వల్ల కూలీలు దొరక్క చాలాచోట్ల పంట నేల రాలింది. వ్యవసాయ పనులకు ప్రభుత్వం కొంత వెసులుబాటు ఇచ్చినప్పటికీ.. అప్పటికే పరిస్థితి చేదాటిపోయింది. ఉన్నపంటను అష్టకష్టాలు ఓర్చి కోత కోసి ఆరబోస్తే... అకాల వర్షం పంటనంతా నీటిపాలుజేసింది. నీటిలో మునిగిన పంట కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదని రైతులు వాపోతున్నారు.
పంటను ఎంతో కొంతకు అమ్ముకుందామనుకున్నా మార్కెట్ లేకపోవడం వల్ల ఇంటివద్దనే నిల్వ పెట్టుకోవలసి వస్తోందని రైతులు చెబుతున్నారు.
ఇదీ చదవండి : అకాల వర్షం.. మిర్చి రైతుకి నష్టం