ప్రజలు సామాజిక బాధ్యతతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో చెత్త నుంచి సంపదను సృష్టించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోందని వివరించారు.
కరోనా వైరస్ వ్యాప్తి తరుణంలో పారిశుద్ధ్య కార్మికులు చేసిన కృషిని మంత్రి అభినందించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులకు ఈ-రిక్షాలను సబ్సిడీపై ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారికి ఆదేశాలు జారీచేశారు. యర్రగొండపలెంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్‌ను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు.