ప్రకాశం జిల్లా మార్కాపురంలో నివాసం ఉంటోన్న తిరుపాలు, లక్ష్మమ్మ దంపతులకు ఎనిమిది మంది సంతానం. వారిలో ఏడుగురు ఆడపిల్లలు కాగా.. ఒక్కగానొక్క కుమారుడు చెన్నకేశవులు. తండ్రి కష్టపడి పూల వ్యాపారం చేస్తూ కేశవులను చదివించాడు. ఆ కష్టానికి తగిన ఫలితాన్ని చూపించి, తండ్రి కళ్ళల్లో ఆనందం చూడాలని కలలు కనేవాడు కేశవులు. చిన్న వయస్సు నుంచి బాధ్యతగా ఉంటూ చదువులో రాణించాడు.
రోడ్డు ప్రమాదంలో కేశవులు మరణం
మార్కాపురంలోనే డిగ్రీ చదివిన చెన్నకేశవులు... అనంతరం నాగార్జున వర్సిటీలో ఎంఏ పూర్తి చేశాడు. ఆ తర్వాత పొలిటికల్ సైన్స్, పబ్లిక్ రిలేషన్స్‌లో పీహెచ్డీ సీటు సాధించాడు. అనేక అంశాల్లో పరీక్షలు రాసి, క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేసి త్వరలోనే స్థిరపడతాడనుకునేలోపే విషాదం జరిగింది. గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో చెన్నకేశవులు మృతి చెందాడు. కుమారుని మరణంతో తల్లిదండ్రులు కలలుగానే మిగిలిపోయాయి. స్నేహితుల ఆశలు ఆవిరయ్యాయి. చేతికి అందివచ్చిన కుమారుని మరణం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది. తల్లి లక్ష్మమ్మ తీవ్ర మనోవేదనతో మూడు నెలల వ్యవధిలోనే కన్నుమూసింది. ఒక్కగానొక్క కుమారుడు, జీవితాంతం తోడుగా ఉండాల్సిన భార్యను కోల్పోవడం వల్ల తండ్రి తిరుపాలు ఆవేదన వర్ణనాతీతం.
ఐదు బంగారు పతకాలు
చెన్నకేశవులు పీజీ, పీహెచ్‌డీల్లో సమర్పించిన పరిశోధన పత్రాలకు విశ్వవిద్యాలయం ఐదు బంగారు పతకాలను ప్రకటించింది. గురువారం జరిగిన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో చెన్నకేశవులు తరఫున తండ్రి తిరుపాలు వాటిని అందుకున్నాడు. కుమారుడు సాధించిన విజయాలకు ఆ తండ్రి మురిసిపోయాడు. అయితే కళ్ల ముందు కన్నకొడుకు లేకపోవడం, ఆ బంగారు పతకాలు తాను తీసుకోవాల్సి రావటంతో తిరుపాలు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. సన్నివేశాన్ని చూసిన సహచర విద్యార్థులు, స్నేహితులు, అధ్యాపకులు కన్నీటిపర్యంతమయ్యారు.
ఇవీ చదవండి: