ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని ఈపురుపాలెం కాలువలో పడి పశుపోషకుడు మృతి చెందాడు. తోటవారిపాలెం పంచాయతీ వీరయ్య నగర్‌కు చెందిన భార్యాభర్తలు ఉప్పలపాటి శ్రీనివాసరావు, సుజాత గతంలో సమోసాలు అమ్ముతూ జీవనం సాగిస్తుండేవారు. ప్రస్తుతం కరోనా వైరస్ వలన వ్యాపారం లేక ఇంటి వద్ద ఉంటూ పశువులను మేపుతూ ఉంటున్నారు.
ఈ క్రమంలో అతడు ఆదివారం మధ్యాహ్నం గేదెలను మేపుకుని తోటవారిపాలెం సమీపంలోని ఈపురుపాలెం కాలువలోకి దిగి గేదెలను కడుగుతున్నాడు. అతడు దిగిన ప్రాంతంలో ఊబి ఉండడంతో నీటిలో మునిగి కూరుకుపోయాడు. ఇంటికి రాకపోవడంతో అతని బంధువులు రాత్రి వరకు వెతికినా ఫలితం లేకుండాపోయింది. ఈరోజు కాలువలో శవంపైకి తేలింది. సమాచారం అందుకున్న ఈపురుపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న యజమాని అకాలంగా మృత్యువాత పడడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.