ప్రకాశంలో మల్బరీ సాగుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నా సాంకేతిక సహకారం అందించే సిబ్బంది లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట విస్తీర్ణం పెంచడానికి అన్నదాతలకు ఇవ్వాల్సిన రాయితీలు, ఎరువులు, పురుగుమందులు వంటివి కూడా రద్దు కావడంతో అన్నదాతల్లో నిరుత్సాహం ఏర్పడింది. లాక్ డౌన్ వల్ల తగ్గిన ధరలు ఇంకా అనుకున్నంత స్థాయికి పెరగకపోవడం వల్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని బెస్తవారి పేట, కంభం, మార్కాపురం ప్రాంతాల్లోని నేల మల్బరీ తోటలకు అనుకూలంగా ఉంటుంది. అక్కడి రైతులు సుమారు 1200 ఎకరాల్లో ఈ పంటను సాగు చేసేవారు. పట్టుగూళ్లను ఉత్పత్తి చేస్తూ ఆదాయాన్ని ఆర్జించేవారు. పంట సాగు, పట్టుగూళ్ల ఉత్పత్తి, మార్కెటింగ్ ఇలా అన్ని విషయాల్లో శాఖాపరమైన సిబ్బంది అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఈ పరిస్థితి లేకపోవడం వల్ల పంటను సాగు చేద్దామనుకున్నా... రైతులు వెనుకంజ వేస్తున్నారు.
ఈ ఏడాది 500 ఎకరాలు విస్తీర్ణం పెంచడనికి ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. అయితే కొవిడ్ కారణంగా ఆలస్యమైంది. గతంలో ఎరువులు, పురుగుమందులు వంటివి కూడా సరఫరా చేసేవారు. మల్బరీ సాగులో డ్రిప్ ఏర్పాటు చేసుకుంటే ఇతర ఉద్యానవన పంటల్లాగానే రాయితీలూ ఇచ్చేవారు. ఇప్పుడు ఇవన్నీ రద్దు చేయడంతో పెట్టుబడి కష్టంగా ఉందని రైతులు వాపోతున్నారు. పట్టుగూళ్ల ఉత్పత్తి దారులకు, దారం తీసేవారికి ప్రభుత్వం ఇన్సెంటివ్‌లు ఇస్తుంది. అయితే ఇన్సెంటివ్ ఇవ్వకపోవడం వల్ల ఉత్పత్తి దారులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఇన్సింటివ్ బకాయిలు విడుదల చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
వర్షాలు బాగా కురవడం వల్ల... ఈ ఏడాది కూడా మల్బరీ సాగు చేయాలనుకుంటున్నా. అయితే లాక్ డౌన్ కారణంగా పట్టు గూళ్లు, దారానికి మార్కెట్ లో ధర గణనీయంగా తగ్గింది. సాధరణంగా గూళ్లు కిలో రూ.500 ఉండేది... కాస్త రూ. 150 కి పడిపోయింది. ఇప్పుడిప్పుడే పరిస్థితితులు మెరుగుపడుతున్నా ప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటివ్‌లు ఇవ్వకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఎలాగైనా రాయితీ బకాయిలు విడుదల చేసి ఆదుకోవాలి.
- ప్రభువాస్ రెడ్డి, మల్బరీ సాగు రైతు, ప్రకాశం జిల్లా
మల్బరీ సాగుకు అవసరమైన షెడ్ల నిర్మాణానికి రూ. మూడున్నర లక్షల వరకూ రాయితీ ఉండేది. అయితే షెడ్లు నిర్మించుకున్నవారికి చెల్లింపులు చేపట్టడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహకాలు ఉంటే సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు, ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండీ: కువైట్ నుంచి చేరుకుంది.. గన్నవరంలో అదృశ్యమైంది!