పెళ్లికి పెద్దలు నిరాకరిస్తారని భావించి.. రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ విఘ్నేశ్వర కాలనీలో జరిగింది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..
ప్రకాశం జిల్లా దేశాయిపేట విఘ్నేశ్వర కాలనీ రైలు పట్టాలపై యువ జంట బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన పోలీసులు..విచారణ చేపట్టారు. మృతి చెందిన యువతి విఘ్నేశ్వర కాలనీకి చెందిన గొర్రెముచ్చు సుధాకర్ రెండో కుమార్తె షకీనా(18)గా గుర్తించారు. ఆమెతో పాటు ఆత్మహత్య చేసుకున్న యువకుడు మైలవరపు సాయి సతీష్(20)గా గుర్తించారు. వీరిద్దరు ప్రేమించుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు చీరాల ఎస్.ఐ నాగరాజు చెప్పారు. ఈక్రమంలో ఇంట్లో పెద్దవారు ఒప్పుకోరని భావించి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నామని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. మృతుల కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చామని ఎస్.ఐ తెలిపారు.
ఇదీ చదవండి: నాటుసారా తయారీ కేంద్రాలపై ఎస్ఈబీ దాడులు