ఖాళీ ప్రభుత్వ భూమి కనబడితే చాలు భూ కబ్జాదారులు వాలిపోతున్నారు. ప్రకాశం జిల్లా దర్శికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొనకొండను గత ప్రభుత్వం పరిశ్రమల కారిడార్‌గా ప్రకటించింది. అప్పటి నుంచి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో, నియోజకవర్గ కేంద్రమైన దర్శిలోని భూముల విలువ నానాటికీ పెరుగుతున్నాయి. ఇదే ఆసరాగా చేసుకుని ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమి కనబడితే చాలు... ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. అంతటితో ఆగక కబ్జాదారులు నకిలీ పట్టాలు సృష్టించి ఆక్రమించిన స్థలాన్ని ఫ్లాట్లుగా మార్చి అమాయకులకు అమ్మి అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు.
ఇదీ జరిగిందీ..
దర్శి పట్టణ శివారులోని దర్శి-అద్దంకి ప్రధాన రహదారికి పక్కన సర్వే నెం 340/5లో ఉన్న 0.94 సెంట్ల స్థలం ఉంది. దీనిలో రాత్రికి రాత్రే బోర్లు వేసి, గృహ నిర్మాణాలకు మార్క్ వేశారు. బహిరంగ మార్కెట్లో ఇక్కడ ఒక సెంటు విలువ సుమారు ఆరు లక్షల నుంచి 8 లక్షల వరకు పలుకుతుంది. ఇంతటి విలువైన స్థలంలో... అదీ ప్రధాన రహదారి పక్కన ఆక్రమించి వ్యాపారం చేస్తున్నప్పటికీ అధికార యంత్రాంగాయానికి తెలియకపోవడం శోచనీయం.
''ఈనాడు, ఈటీవీ-భారత్ ''సమాచారంతో రంగంలోకి..
ఈ విషయాన్ని ఈనాడు-ఈటీవీ భారత్ కలసి చారవాణి ద్వారా దర్శి తహసీల్దారు అశోక వర్ధన్ దృష్టికి తీసుకెళ్లింది. దీనికి స్పందించిన ఆయన.. అది ప్రభుత్వ భూమేనని తెలిపారు. అయితే దానిలో 0.16 సెంట్లు భూమిని పీఏసీఎస్ బ్యాంక్ భవన నిర్మాణానికి కేటాయించామని, మిగిలిన స్థలానికి హద్దులు ఏర్పాటు చేసి.. ప్రభుత్వ భూమి అనే సూచికలు చేయిస్తామని అన్నారు.
ఇదీ చదవండి: