లాక్‌డౌన్‌తో జిల్లాలోని పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. నెల రోజులకు పైగా దాదాపు అన్ని పరిశ్రమల తలుపులు తెరుచుకోవడం లేదు. క్వారీలు, ఫాలిషింగ్ యూనిట్లతో పాటు 6,500 వరకు చిన్న పరిశ్రమలు, గ్రామీణ వస్త్ర, ఫుడ్, ప్రాసెసింగ్ యూనిట్లు వంటివి ఇందులో ఉన్నాయి. లాక్‌డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తారా అని ఆయా పరిశ్రమల యజమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఒక్క పాజిటివ్ కేసు కూడా లేని గ్రీన్ జోన్లలో పరిశ్రమలు, వాణిజ్య కార్యక్రమాలకు ప్రభుత్వం అనుమతించింది. మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు యాజమాన్యాలు ముందుకు రావాలని కలెక్టర్ పోలా భాస్కర్ ఇటీవల కోరారు. ఈ మేరకు నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారి, వైద్యఆరోగ్య, పోలీసు ఇన్‌స్పెక్టర్, పరిశ్రమ శాఖ, సహాయ కార్మిక శాఖ అధికారులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు.
పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభించేందుకు యజమానులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందులో ధాన్యం, పప్పుల మిల్లులు, డెయిరీ ఉత్పత్తులు, ఆర్వో, మినరల్ వాటర్, బిస్కట్స్, ఫ్రూట్స్ జ్యూస్ వంటి ఆహార ఉత్పత్తులు, కొవిడ్-19 కిట్స్, వెంటిలేటర్స్ వంటి వైద్య ఉత్పత్తులు, సబ్బులు, బ్లీచింగ్ పౌడర్, పేపర్ న్యాప్‌కిన్స్, గ్యాస్, ఆగ్రో ప్రొడక్ట్స్, ఫౌల్ట్రీ, ఫిష్ ఫీడ్ వంటి పరిశ్రమలున్నాయి.
వీటితోపాటు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు అన్ని పరిశ్రమలకు అనుమతి ఇచ్చేందుకు పరిశ్రమల శాఖ నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా ఆన్‌లైన్‌లోని దరఖాస్తులను పరిశీలించి అనుమతి ఇవ్వనుంది.
మొత్తం 219 దరఖాస్తులు
"జిల్లాలో మినహాయింపు ఇచ్చిన అన్ని రకాల పరిశ్రమల నిర్వహణకు గాను బుధవారం సాయంత్రం వరకు మొత్తం 219 దరఖాస్తులు వచ్చాయి. అందులో 43 పరిశ్రమలకు ఆమోదం తెలిపాం. మరో 20 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించాం. మిగిలినవి పరిశీలనలో ఉన్నాయి." - చంద్రశేఖర్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్
ఇదీ చదవండి: