Sand Shortage : ప్రకాశం జిల్లాలో ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరత అధికంగా ఉంది. జిల్లాలో పలుచోట్ల ఇసుక నిల్వలు తగ్గడంతో గృహ నిర్మాణలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో ఒంగోలు, దర్శి, కనిగిరి, యర్రగొండపాలెం, మార్కాపురం, సంతనూతలపాడు ప్రాంతాల్లో ఇసుక నిల్వ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాలకు నెల్లూరు, గుంటూరు నుంచి ఇసుక దిగుమతి చేసి.. ఇక్కడ నుంచి అధికారికంగా విక్రయించాలి. ఈ జిల్లావాసులు ఎక్కువగా నెల్లూరు నుంచి వచ్చే ఇసుకనే వినియోగిస్తారు. ఐతే ఇటీవల నెల్లూరు నుంచి ఇసుక రవాణా నిలిచిపోయింది.
ఒంగోలులోని నిల్వ కేంద్రాల్లో గుంటూరు నుంచి ఇసుక దిగుమతి చేసుకుంటున్నారు. ఈ ఇసుక నాణ్యంగా ఉండడం లేదని.., తప్పని పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. ఇక్కడ ఇటీవల వరకూ రూ.600 ఉన్న ఇసుక 800 రూపాయలకు పెంచేశారు. కొన్నిచోట్ల 1500 రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు.
ఇసుక సమస్య ఎక్కువ ఉంది. కాంట్రాక్టర్లు వచ్చి ఓ సారి 600 అంటున్నారు.. ఇంకోసారి 800 అంటున్నారు. దాని వల్ల ఉపయోగం లేదు. బిల్డింగులు కడితే పడిపోతాయి. - ఆనంద్, ఒంగోలు
ఇసుక దొరకడం లేదు. ప్రభుత్వం దగ్గర స్టాకు లేదు. వాగుల్లో దొరికేది నాణ్యంగా ఉండట్లేదు. మూడున్నర వెయ్యి చెప్తున్నారు. బయట కొందామంటే అవకాశం ఇవ్వట్లేదు. కేసులు రాస్తున్నారు. - షేక్ ఖాసీం, కనిగిరి
పేరుకే ఉచితమని ప్రకటించినా.. రవాణా చార్జీలు పేరుతో పెద్దఎత్తున వసూలు చేస్తుండటం తమకు భారంగా మారుతుందని.. గృహనిర్మాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక విధానం లోపభూయిష్టంగా ఉండటం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆరోపిస్తున్నారు.
ఇవీ చదవండి :