ప్రకాశం జిల్లాలో భారీ ఎత్తున సాగుతున్న రేషన్ బియ్యం దందా మంగళవారం వెలుగుచూసింది. రేషన్ బియ్యాన్ని సేకరించి పాలిషింగ్ అనంతరం వివిధ బ్రాండ్ల పేరుతో బస్తాల్లో నింపుతున్న వైనం ఎన్‌ఫోర్స్‌మెంట్ సోదాల్లో బట్టబయలైంది. రెండు మిల్లులపై పక్కాగా అందిన సమాచారంతో జిల్లా పౌర సరఫరాల అధికారి (డీఎస్‌వో) సురేష్ ఆధ్వర్యంలో రెవెన్యూ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మంగళవారం ఉదయం రంగంలోకి దిగారు. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలోని మణికంఠ రైస్ మిల్లులో తొలుత తనిఖీలు చేశారు. గుమ్మడి వెంకటేశ్వర్లుకు చెందిన ఈ మిల్లును కొరిశపాడు మండలం రెడ్డిపాలెంకు చెందిన కోటిరెడ్డి, మరికొందరు వ్యక్తులు అద్దెకు తీసుకుని నడుపుతున్నారు.
రేషన్ బియ్యాన్ని యంత్రాల సాయంతో సోర్టెక్స్ చేసి కర్నూల్ బియ్యం, మలేషియా పేరుతో 25 కేజీల సంచులుగా ప్యాక్ చేసి అమ్ముతున్నట్లు తనిఖీల్లో తేలింది. ఎఫ్‌సీఐ గోదాము నుంచి వచ్చే బియ్యం బస్తాలు వచ్చినవి వచ్చినట్లే వేలల్లో ఇక్కడ ఉండటాన్ని గుర్తించి అవాక్కయ్యారు. పాలిషింగ్ చేసి తెల్ల గోతాముల్లో పోసినవి, రాసులుగా పోసి ఉన్నవి కలిపి మొత్తంగా 5వేలకు పైగా బస్తాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒక్క రేషన్ బియ్యమే 1,398.10 క్వింటాళ్లు ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ రూ.44.73 లక్షలుగా పేర్కొన్నారు. కొన్నింటిపై పశ్చిమగోదావరి జిల్లా పేరు కనిపించింది. అధికారుల బృందం మద్దిపాడు మండలం వెల్లంపల్లి వద్ద ఉన్న లక్ష్మీదత్త రైస్‌మిల్లులోనూ తనిఖీలు చేసింది. ఇక్కడ రూ.9.12 లక్షల విలువైన 285 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక ట్రక్కులో తరలిస్తుండగా వెంబడించి పట్టుకున్నట్లు తెలిపారు.
ఇది తీవ్ర నేరం: సురేష్, పౌరసరఫరాల అధికారి, ప్రకాశం
‘రైతుల నుంచి ధాన్యం సేకరించి బియ్యంగా మార్చి ప్రభుత్వానికి ఇచ్చే కొన్ని మిల్లులు ఉంటాయి. ఆ జాబితాలో మణికంఠ రైస్ మిల్లు లేదు. రేషన్ బియ్యం కొని వాటిని రీసైక్లింగ్ చేయడం తీవ్రనేరం. ఇలా ఎవరు చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తాం. ఎఫ్‌సీఐ గోదాము నుంచి వచ్చే 50 కేజీల సంచులు, 25 కేజీల సంచుల్లో ఉన్న 1,398.10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ప్రాథమికంగా గుర్తించాం. వాటి విలువ రూ.44,73,920 ఉంటుంది. లక్ష్మీదత్త మిల్లులో మరో 285 క్వింటాళ్లు స్వాధీనం చేసుకున్నాం. దీని వెనుక ఎవరున్నారన్నది తేలాల్సి ఉంది’.
ఇదీ చదవండీ..