అనుమానంతో రెండో భార్యను హత్య చేసిన కేసులో భర్తను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పర్చురులో నివాసం ఉంటున్న మీరాబి భర్త చాలా కాలం క్రితం మృతి చెందాడు. ఒంటరిగా జీవిస్తున్న ఆమెకు ఎలక్ట్రీషియన్ సయ్యద్ బాబు పరిచయమయ్యాడు. ఇది కాస్త పెళ్లి వరకు వెళ్లింది. ఇదివరకే వివాహమైన సయ్యద్ బాబు... ఈమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. సయ్యద్ మొదటి భార్య చీరాలలో ఉంటోంది. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.
రెండో వివాహం చేసుకున్న మీరాబిపై సయ్యద్‌కు అనుమానం మొదలైంది. కూలి పనులకు వెళ్లే ఆమె... ఆటో డ్రైవర్‌తో సన్నిహతంగా ఉంటోందని తరచూ గొడవపడేవాడు. చివరకు తన నుంచి మీరాబి దూరమైపోతుందని అపోహ పడి... చంపాలని పథకం వేశాడు.
క్రిస్మస్ రోజున... ఇంట్లో ఉన్న కుమారుణ్ని నీళ్లు తీసుకురమ్మని బయటకు పంపించి... మీరాబిని చంపేశాడు. చాకుతో ఆమె గొంతు కోసి... తర్వాత పొడిచి పొడిచి చంపి పరారయ్యాడు. నీళ్లు తీసుకొచ్చిన కుమారుడు... తల్లి మృతదేహాన్ని చూసి బోరుమన్నాడు. స్థానికులను పిలిచి విషయం చెప్పాడు. వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదు రోజులుగా సయ్యద్ బాబు కోసం గాలించారు. చివరకు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్టు విచారణలో అంగీకరించాడని పోలీసులు తెలిపారు.