నివర్ తుపాను కారణంగా రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో... ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. బోర్ల కింద వేసిన వరి పంట కోతకోసి చేలపై ఓదెలుగా ఉన్నాయి. మినుము, మిరప, కంది, పెసర మొదలైన పంటలు వర్షం కారణంగా దెబ్బతిన్నాయని రైతులు తెలిపారు. దర్శి మండలంలోని త్రిపురసుందరీపురం గ్రామంలో... సుమారు వంద నుంచి 200 ఎకరాల వరకు వరి పంట నీటమునిగినట్లు రైతులు తెలిపారు. కష్టపడి పండించిన పంటలు నీటిపాలవటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. నీట మునిగిన వరి పంట ఓదెలను చేల గట్లపైకి చేర్చుకుంటున్నారు.
లోతట్టు పాంతాలు జలమయం
నివర్ తుపాన్ కారణంగా ప్రకాశం జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఒంగోలు పట్టణంలోని పోతురాజు కాలువకు ఇరువైపులా ఉన్న అరుణాకాలనీ, పాపా కాలనీలు వరదనీటిలో మునిగిపోయాయి. వర్షాలు కురిసినప్పుడల్లా వరద నీరు ఇళ్లల్లోకి వచ్చి చేరుతోందని, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని బాధితులు పేర్కొంటున్నారు.
రాకపోకలకు ఇబ్బందులు... విద్యుత్ సరఫరాకు అంతరాయం
ప్రకాశం జిల్లాలో జాతీయ రహదారిపై రాకపోకలు నియంత్రించారు. మార్టూరు మండలం రాజుపాలెం చెక్ పోస్టు వద్ద పార్కింగ్ ఏరియాకు వాహనాలను తరలించారు. దర్శి మండలంలోని త్రిపురసుందరీపురం గ్రామం వద్ద రహదారి కోతకు గురైంది. మారళ్ల ఈదరవాగు రహదారిపై 12 అడుగులు మేర ప్రవహిస్తుండటంతో పోలీసులు రహదారిపై రాకపోకలు నిలిపివేసి, పహారా కాస్తున్నారు.
ఉలవపాడు మండలంలో ఆత్మకూరు కాలువ పొంగి ప్రవహిస్తోంది. అర్ధవీడు మండలంలో కురిసిన వర్షాలకు తీవ్ర పంటనష్టం కలిగింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
నీటమునిగిన నారుమళ్లు
జిల్లాలోని చినగంజాం, స్వర్ణ ప్రాంతంలో కురిసిన వర్షానికి 100 ఎకరాల్లో వేసిన వరి నారుమళ్లు నీటమునిగాయి. పంటపొలాలు చెరువులను తలపిస్తున్నాయి. 20 రోజుల క్రితమే వరినాట్లు వేశామని... వర్షానికి పూర్తిగా తుడిచిపెట్టుకు పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గిద్దలూరులో
గిద్దలూరు నియోజకవర్గంలోని, అర్ధవీడు, కంభం, బేస్తవారిపేట, గిద్దలూరు మండలాల్లో వరి, శనగ, మిర్చి పంటలు బాగా దెబ్బతిన్నాయి. 200 ఎకరాల్లో వరి, 100 ఎకరాల్లో శనగ, 100 ఎకరాల్లో మిర్చి పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన చెందారు. దెబ్బతిన్న పంటలను ఏడీఏ బాలాజీ నాయక్ పరిశీలించారు
భారీగా పంట నష్టం
అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం పరిసర ప్రాంతాల్లో సాగులో ఉన్న సుమారు 400 ఎకరాల శనగ పంట, 100 ఎకరాలకు పైగా వరి పంట తుపాన్ ప్రభావం వల్ల నీటమునిగాయి.
కనిగిరి వ్యవసాయ సబ్ డివిజన్లో అన్నదాతలు విలవిలలాడిపోతున్నారు.మూడురోజులగా కురుస్తున్న వర్షాలకు పంటలన్నీ నీట మునిగాయి. కనిగిరి వ్యవసాయ సబ్ డివిజన్లో నష్టపోయిన పంటల వివరాలు అధికారులు అంచనా వేసి తెలిపారు. మార్కాపురం వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు, కంభం, అర్దవీడు మండలాల్లో మొత్తం 20,617 హెక్టార్లలో పంటలు నష్టపోయినట్లు అధికారులు తేల్చారు.
పంట పేరు | సాగు చేసిన విస్తీర్ణం(హెక్టార్లలో) | అంచెనా వేసిన నష్టం(హెక్టార్లలో) |
వరి | 1200 | 1120 |
మినుము | 10626 | 7570 |
శనగ | 4083 | 928 |
పత్తి | 50 | 47 |
అలసంద | 1200 | 517 |
మిర్చి | 100 | 47 |
పొగాకు | 320 | 25 |
ఇతర పంటలు | 150 | 59 |
నివర్ తుపాను కారణంగా జిల్లాలోని యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఓ మోస్తారు వర్షం కురుస్తోంది. త్రిపురంతాకం మండలంలోని పలు గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కనిగిరి నియోజకవర్గంలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను తెదేపా ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పర్యటించి... భాదిత రైతులను పరామర్శించారు. దెబ్బతిన్న పంటనష్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తుపాన్ ధాటికి పెదచెర్లోపల్లి మండలంలోని పాలేటిపల్లి రిజర్వాయర్ ఉద్ధృతంగా ప్రవహిస్తుంది.
ఇదీ చదవండి: