ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామంలో 170 మందికి నివేశన స్థలాలు ఇవ్వడానికి అధికారులు నిర్ణయించారు. పమిడిపాడు శివారులో మూడు ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు సేకరించేందుకు సిద్ధపడి గతంలోనే గ్రామసభ నిర్వహించారు. ఆ ప్రదేశం శ్మశానానికి ఆనుకుని ఉంటుందని, దాని వెనుక ఊరుచెరువు ఉందని గ్రామస్థులు అభ్యంతరం తెలిపారు. గ్రామసభ వాయిదా పడింది. లబ్ధిదారులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు కూడా తర్వాత దానివైపు చూడలేదు.
ఈనెల 25న ఇళ్లపట్టాల పంపిణీకి అధికారులు చర్యలు చేపట్టారు. అందుకు అనుగుణంగా ఇటీవల స్థానికంగా గ్రామ సభ ఏర్పాటు చేసి లాటరీ తీశారు. ఆ మేరకు గతంలో వివాదం ఉన్న స్థలాన్నే ఖరారు చేశారు. పొలం పనులకు వెళ్లిన సమయంలో లాటరీ ఎలా తీస్తారని...సేకరించిన పొలం రోడ్డుకు కొంచెం దిగువన ఉందని... మట్టితో లెవల్ చేయడానికి చాలా వ్యయం అవుతుందని లబ్ధిదారులు అధికారులను అడిగారు. శ్మశానాల పక్కన...చౌడు భూముల్లో ఇళ్లు ఎలా నిర్మిస్తామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...ఇప్పటికైనా అందరికి అమోదయోగ్యమైన స్థలంలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతున్నారు
స్థల సేకరణపై గ్రామస్థుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు రాలేదని...అందుకే ఆ భూమినే నివేశనస్థలాలకు కేటాయించాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. గ్రామస్థులు మాత్రం ఉన్నాతాధికారులకు అర్జీలు ఇచ్చినా ఎటువంటి ప్రయోజన లేకుండా పోయిందని వాపోతున్నారు.