పార్టీలకు అతీతంగా సాగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొన్ని చోట్ల పోటీ అంటే ఆషామాషీ కాదు మరి. నోట్ల కట్టలు తెగుతాయి. ఓటర్లను ప్రలోభాల్లో ముంచెత్తుతుంటారు. గత ఎన్నికలను పరిశీలిస్తే.. జిల్లాలో భారీగా నగదు వెదజల్లి ఓట్లను కొనుగోలు చేసిన ఉదంతాలు కనిపిస్తాయి. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని కొన్ని పంచాయతీల్లో కొందరు సర్పంచి అభ్యర్థులు ఒక్కో ఓటుకు రూ. 2000 నుంచి రూ. 5000 వరకు వెచ్చించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్ఛు అద్దంకి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లోనూ భారీగానే నగదు వెచ్చించారు.
ఇక్కడ ‘కట్టలు’ తెంచారు...
2013లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో తాళ్లూరులో అత్యధికంగా ధన ప్రవాహం కొనసాగింది. మొత్తం 4500 ఓటర్లున్న ఈ పంచాయతీలో సర్పంచి పదవి కోసం ఇద్దరు అభ్యర్థులు పోటీ పడ్డారు. వీరిద్దరూ కలిసి రూ.కోటికి పైగా ఖర్చు చేసినట్టు సమాచారం.
- దర్శి మండలం రాజంపల్లిలో ఇద్దరు అభ్యర్థులు దాదాపు రూ. కోటి పైగా ఖర్చు చేసినట్టు ప్రచారం.
- మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని పొదిలి పట్టణంలోనూ అభ్యర్థుల ఖర్చు రూ. అర కోటికి పైగా అయినట్టు సమాచారం.
- చీరాల నియోజకవర్గంలోని వేటపాలెంలోనూ ఇద్దరు అభ్యర్థుల పంచాయతీ ఎన్నికల ఖర్చు రూ. అర కోటికి పైమాటే.
- దర్శి నియోజకవర్గ పరిధిలోని ముండ్లమూరు మండలంలోనూ ఎన్నికలు ఖరీదైనవే. ఇక్కడి కొన్ని పంచాయతీల్లో ఓటుకు రూ. వెయ్యి నుంచి రూ. 1500 వరకు వెదజల్లారు. మారెళ్ల పంచాయతీలో 3200 మంది ఓటర్లుండగా.. ఒక్కో అభ్యర్థి రూ. 25 లక్షలకు పైగా వెచ్చించారు. 2200 మంది ఓటర్లున్న శంకరాపురంలోనూ అభ్యర్థులకు రూ. అర కోటికి పైగానే ఖర్చు చేశారు.
- తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలెంలో 2007 నాటి పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు పోటాపోటీగా నగదు వెదజల్లారు. కేవలం వెయ్యిలోపు ఓటర్లున్న ఈ గ్రామంలో రూ. 60 లక్షలకు పైగా ఖర్చు చేశారు.
ఇదీ చదవండి: తొలిదశ నామినేషన్ల చివరిరోజు దాడుల పర్వం