తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని మోసగించి దాడిచేసి నగదు లాక్కొని పారిపోయిన ముఠాను గుంటూరు జిల్లా బాపట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటనకు వివరాలను డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు.
ఒంగోలు పట్టణం మంగమూరు డొంక ప్రాంతానికి చెందిన నల్లమోతు కిరణ్ ఆర్మీలో పని చేసి రిటైరయ్యారు. ప్రస్తుతం ఇనుము, సిమెంట్ వ్యాపారం చేస్తున్నారు. అతనికి నందు అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ప్రతాప్ అనే వ్యక్తి దగ్గర తక్కువ రేటుకు బంగారం ఇప్పిస్తానని కిరణ్‌ను నమ్మించాడు. గత నెల 27వ తేదీన కిరణ్‌ను బాపట్ల మండలం కంకటపాలెం ప్రాంతానికి తీసుకు వెళ్లాడు. అనుమానం వచ్చిన కిరణ్ బంగారం ఎక్కడ అని ప్రశ్నించగా.. అక్కడ నుంచి కొత్తపాలెం శివారుకి తీసుకెళ్లాడు. అక్కడికి ముగ్గురు చేరుకుని వారి వద్ద ఉన్న బంగారాన్ని చూపించారు.
పోలీసులమంటూ బెదిరించి..
కొంతసేపటికి మరో ముగ్గురు అక్కడికి చేరుకున్న మరో ముగ్గురు తాము పోలీసులమంటూ.. బెదిరించి కిరణ్‌పై దాడిచేసి అతని వద్ద ఉన్న 6 లక్షల 10 వేల రూపాయలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వారి ఆట కట్టించారు. ఆరుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 3 లక్షల 60 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో నలుగురిని అరెస్ట్ చేయాల్సి ఉందని చెప్పారు.
ఇదీ చదవండి: FACEBOOK FRIENDSHIP: ప్రాణం మీదకు తెచ్చిన ఫేస్‌బుక్ పరిచయం