ఒకప్పుడు వ్యవసాయం చేస్తే.. పండగే.. మరి.. ఇప్పుడో? చావే పరిస్థితి. మట్టి వాసనకు మురిసిపోయే జీవితాలు.. బలవంతపు చావుతో అదే మట్టిలో కలిసిపోతున్నాయి. పంటపొలాల్లో వచ్చే.. స్వచ్ఛమైన గాలిలోనే.. అన్నదాతల ఉసురు కలిసిపోతోంది. ఒకప్పడు నా ప్రాణం పోయేంతవరకూ వ్యవసాయం చేసుకుని బ్రతుకుతానన్న రైతు.. వ్యవసాయం చేస్తే.. ప్రాణం పోతుంది అనే స్థితికి వచ్చాడు. అలా ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం సిద్దినాయునిపల్లికి చెందిన శింగనరెడ్డి సత్యనారాయణ రెడ్డి అనే రైతు ఊపిరి.. గాలిలో కలిసిపోయింది. కానీ ఆయన రాసిన లేఖ.. అన్నంపెట్టే రైతన్నల జీవితం ఇలా ఉంటుందా.. అని కళ్లలో నీళ్లు తిరిగేలా చేస్తోంది.
'అయ్యా శింగారెడ్డి సత్యనారాయణరెడ్డి అను నేను. వ్యవసాయం చేయడానికి చాలామంది దగ్గర అప్పులు తీసుకున్నాను. నాకు 9 ఎకరాలు పొలము ఉన్నది. నేను ఈ అప్పులు మెుత్తం పొలము పెట్టుబడులకు తెచ్చుకున్నవి. కానీ పాడు సంవత్సరం నాకు పొలము మీద ఒక్క రూపాయి గూడా రాలేదు. కనీసం నేను పెట్టిన పెట్టుబడులు గూడా రాలేదు. నేను పొలములో 16 బోర్లు వేయించినా.. కానీ ఒక్క దాంట్లో కూడా నీళ్లు పడలేదు. వర్షాలు లేవు. ఈ విధముగా చేసిన అప్పులే అవి. నేను తిరుగుబోతును కాదు.. తిండి పోతును కాదు... తాగుబోతును కాదు. నేను ఎవరికీ ఏ అన్యాయం చేసిన వాడిని కాను. కానీ నాకు ఆ దేవుడు ఎందుకో ఈ శిక్షవేసినాడు. నా బార్య, నా తల్లి కష్ట జీవులు వారికి కష్టం చేయడం తప్ప ఏమీ తెలియదు. వారికి నేను అన్యాయం చేస్తున్నందుకు బాధగా ఉన్నది. కానీ తప్పటం లేదు. నా కుమారులకు చెప్పేది.. ఏమనగా ఈ అప్పులోళ్లకు ఏదో ఒకటి అమ్మి అప్పులు ఇయ్యండి. కానీ మీరు మాత్రం పొలం మీద ఆధార పడకుండా బయటకు పోయి ఏదో ఒక పని చూసుకోని బతకండి. పొలమును నమ్ముకుంటే నా పరిస్థితి మీకు తప్పదు. మా కుటుంబ సభ్యులకు అందరికీ అప్పులు ఉన్నవి అని తెలుసు కానీ ఎవరికీ ఎంత ఇయ్యాలో ఎంత అప్పు ఉన్నదో తెలియదు. ఈ అప్పు ఎలా ఇయ్యాలో అని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. కానీ నాకు ఏ దారి అగుపడలేదు. కనుక ఈ దారినే ఎన్నుకున్నాను. ఇంకానేను కుటుంబ భారాన్ని మోయలేక, అప్పుల వారికి సమాధానం చెప్పలేక ఎంతో మనోవేదన అనుభవిస్తున్నాను. కనుక నేను చనిపోవాలని నిర్ణయించుకున్నాను. నేను పొలం అమ్మి అప్పులు తీర్చేవాడిని.. కానీ నేను ఇంతకుముందు 1995 సంవత్సరం 6 ఎకరాలు అమ్మినాను. మళ్లీ నేను అమ్మాలంటే నాకు ఇష్టపడటం లేదు. రెండు సార్లు పొలాన్ని అమ్మి జనంలోకి తిరగాలంటే నాకు ఇష్ట పడటం లేదు. నాకు కూడా బతకాలి, జనంలో తిరగాలి అని ఉన్నది. కానీ నాకు దేవుడు అదృష్టం ఇయ్యలేదు. నా కుమారులు కొండారెడ్డికి, సుబ్బారెడ్డికి చెప్పేది ఏమనగా మీరు మమ్మిని, అవ్వను బాగా చూసుకోండి. వాళ్లకు కష్టం చేయ్యటం తప్ప ఇంకేమీ తెలియదు. మీరు ఏదో ఒక పని చూచుకొని బతకండి. మిమ్మిల్ని అందరినీ ఇడిసిపెట్టి పొతున్నందుకు నాకు కూడా బాధగానే ఉన్నది.. కానీ తప్పటం లేదు.' నా సావుకి నేనే కారణం
ఇట్లు
శింగారెడ్డి సత్యనారాయణ రెడ్డి
ఇదీ చదవండి..