No works for Solar plant: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా.. రెండేళ్ల క్రితం ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా 2020లో ప్రకాశం జిల్లా దొనకొండ మండలం రుద్ర సముద్రం వద్ద వెయ్యి మెగావాట్ల సామర్ధ్యంతో సోలార్ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా.. దానిలో పురోగతి మాత్రం లేదు.
హామీ ఇచ్చారు.. కానీ..
దొనకొండ మండలంలోని రుద్రసముద్రం, మంగినపూడి, బొమ్మనపల్లిలో సాగులో ఉన్న భూములను అధికారులు సోలార్ ప్రాజెక్టు కోసం పరిశీలించారు. తొలుత స్థానిక రైతులు అభ్యంతరం తెలిపారు. సోలార్ ప్లాంట్‌తో పర్యావరణం దెబ్బతింటుందని, భూములు కోల్పోతే జీవనోపాధి పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు హామీ ఇచ్చి రైతుల నుంచి దాదాపు మూడు వేల ఎకరాలు సేకరించారు. సాగులో ఉన్న భూములకు హక్కులు కల్పించి పట్టాలు ఇస్తామని.. ఎకరాకు 25 వేల రూపాయలు కౌలు ఇస్తామని ఒప్పించారు. అవి తమకు ఏ మాత్రం సరిపోవని రైతులంటున్నారు.
ఏళ్లు గడుస్తున్నా ప్లాంట్ ఏర్పాటు కాలేదు
సోలార్ ప్లాంట్ కోసం ఏపీఐఐసీ భూముల నుంచి మరో 15 వందల ఎకరాలు అధికారులు కేటాయించారు. త్వరలో ప్లాంట్ పనులు ప్రారంభమవుతాయని.. గుర్తించిన పొలాల్లో పంటలు వేయవద్దని రైతులకు చెప్పారు. రెండేళ్లు గడుస్తున్నా ప్లాంట్ ఏర్పాటు చేయలేదని.. సాగు భూములకు పట్టాలు కూడా ఇవ్వలేదని రైతులు అంటున్నారు. ఈ విషయంపై స్పష్టత లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. సోలార్ ప్లాంట్ వద్దంటున్నారు. అధికారులు మాత్రం త్వరలోనే రైతులకు ఒప్పందం ప్రకారం పరిహారం ఇస్తామని చెబుతున్నారు. సోలార్ ప్లాంట్ నిర్మించడం లేదని అధికారులు చెబితే.. తమ పొలాల్లో సాగు చేసుకుంటామని రైతులు అంటున్నారు.
ఇదీ చదవండి: