ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని నాగులపాడులో విద్యుదాఘాతంతో రైతు, పాడిగేదె మృత్యువాతపడ్డాయి. గ్రామానికి చెందిన రైతు కె.చిరంజీవి ఉదయాన్నే గేదెల్ని తోలుకొని నల్లవాగు సమీపంలోని పొలానికి వెళ్లాడు. సాయంత్రానికి కొన్ని గేదెలే ఇంటికి వచ్చాయి. యజమానితోపాటు పాడి గేదె ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గేదెలు వచ్చిన దారిలోనే అతని కోసం వెతుక్కుంటూ వెళ్లగా...కాలువ గట్టున విద్యుదాఘాతంతో మృతిచెందిన చిరంజీవిని గుర్తించారు. అతని పక్కనే పాడి గేదె పడి ఉంది. పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ ఎం.శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యుదాఘాతానికి గురైన గేదెను తప్పించేటప్పుడు...అతను మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ బస్సు ఢీ కొని బాలుడు మృతి