కాసేపటిలో ఇంటికి చేరుకుంటామనుకునే ఉత్సాహంలో ఉన్న ఆ కుటుంబానికి... ఆ చిన్నారి అకాల మరణం తీరని విషాదాన్ని మిగిల్చింది. మృత్యువు గూడ్స్ రైలు రూపంలో ఓ ఆరేళ్ల బాలికను కబళించింది. అప్పటివరకు అమ్మ, అమ్మమ్మతో సరదాగా ఉన్న ఆ చిన్నారిని.. త్వరగా ఇంటికి చేరాలన్న ఆరాటంలో చేసిన పొరబాటు... పట్టాలపై విగతజీవిగా కనిపించేలా చేసింది. ప్రకాశం జిల్లా వేటపాలెం రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఈ ఘటన.. తీవ్రంగా కలిచివేసింది. తల్లి, అమ్మమ్మ రోదనలు మిన్నంటాయి.
ఒంగోలు పేర్నమిట్ట ప్రాంతానికి చెందిన తన్నీరు సుజాతకు ఇద్దరు కుమార్తెలు. సుప్రజ (6) పెద్ద అమ్మాయి. ఆనారోగ్యంతో ఉన్న సుజాత శనివారం ఒంగోలు వైద్యశాలలో చూపించుకున్నారు. అనంతరం వేటపాలెంలోని తన పుట్టింటికి పిల్లలు, తన తల్లితో కలిసి బయలుదేరారు. బస్సు దిగిన వీరు వేటపాలెం రైల్వేస్టేషన్ అవతల ఉన్న అంబేడ్కర్ కాలనీలోని ఇంటికి వెళ్లాల్సి ఉంది. అక్కడ రైలు పట్టాలు దాటడం మినహా మరో మార్గం లేదు. అప్పటికే ఆగి ఉన్న గూడ్సు రైలు కింద నుంచి ముందుగా అమ్మమ్మ వెళ్లింది. ఆ తర్వాత సుప్రజ అనుసరించింది. అంతలోనే రైలు ఒక్కసారిగా కదలడంతో చక్రాల కిందపడి చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తల్లడిల్లారు. అప్పటివరకు తమతో ఉన్న బిడ్డ విగతజీవిగా మారడంతో తీవ్రంగా విలపించారు.
ఇవీ చదవండి:
గ్రామంలో అథ్లెటిక్స్‌కు శిక్షణ..శభాష్ అనిపించుకుంటున్న యువకుడు