యావత్ విశ్వాన్ని సృష్టించే శక్తి ఒక్క మహిళకే సాధ్యం. అందుకే నేటి మహిళ అన్ని తానై నడిపిస్తోంది. ఆధునిక ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తోంది. ఇప్పుడు మహిళలు వంటింటి కుందేళ్లు కాదు.. అన్ని రంగాల్లోనూ చక్రం తిప్పే మహరాణులు. ప్రకాశం జిల్లా చీరాలలోని హరిప్రసాద్‌నగర్‌కు వెళ్లిన ఎవరికైనా ఈ భావనే కలుగుతుంది. ఆ ఊరిలో అడుగుపెట్టగానే బెల్లం, వేరుశనగ, జీడిపప్పు సువాసనలు నోరూరించేస్తాయి. పొదుపు సంఘాల ఆధ్వర్యంలో అక్కడి మహిళలు చేస్తున్న పని.. ఇలా బెల్లంతో వివిధ రకాల చెక్కీలు చేయటమే. ఎన్నో కుటుంబాలు ఈ వృత్తి పైనే ఆధారపడ్డాయి. ఆర్థిక స్వావలంబన సాధించాయి. పొదుపు సంఘాల ద్వారా అందిన రుణాలు వారి జీవితాలను నిలబెడుతున్నాయి.
పొదుపు సంఘాలుగా ఏర్పడ్డ మహిళలు.. ప్రభుత్వం ఇచ్చిన రుణంతో ఈ వ్యాపారాలు చేసి.. రుణాలను సమయానికే చెల్లించేస్తారని మెప్మా అధికారులు చెప్పారు. వేరుశనగ ముద్దలు, జీడిపప్పు పాకం, మరికొన్ని తినుబండారాలను తయారు చేసి ఉపాధి పొందుతున్నారు. ఆ పదార్థాలను చుట్టుపక్కల ప్రాంతాలకు విక్రయిస్తున్నట్టు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు చెన్నై కూడా పంపిస్తామన్నారు. తాము ఎందులోనూ తీసిపోమని నిరూపించారు. తమ కష్టాన్నే ఆయుధంగా మలచుకుని, అందులోనే తమ సంతోషాన్ని వెతుక్కుంటున్నామన్నారు. హాయిగా కుటుంబాన్ని పోషించుకుంటున్నామని దీమా వ్యక్తం చేస్తున్నారు.
రుణాలను పెంచితే తమ వ్యాపారాన్ని విస్తృతం చేసి మరికొందరికి ఉపాధి కలిపిస్తామని పొదుపు సంఘాల మహిళలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: