WATER PROBLEMS : రాష్ట్రంలోని పలు పట్టణాలు, గ్రామాల్లో వేసవికి ముందే ప్రజలకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. నీటి కొరతతో 22 పట్టణ, నగరపాలక సంస్థల్లో రెండు రోజులకోసారి నీరు అందిస్తున్నారు. ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయతీలో మూడు రోజులకోసారి సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం సరిగా నిధులు విడుదల చేయని కారణంగా గ్రామాల్లో రక్షిత తాగునీటి పథకాల నిర్వహణ అధ్వానంగా ఉంది. రూ.200 కోట్లకుపైగా పెండింగ్ బిల్లులు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.
ప్రస్తుతం బద్వేల్, చిలకలూరిపేట, ధర్మవరం, డోన్, గిద్దలూరు, గుత్తి, గూడూరు (కర్నూలు జిల్లా), హిందూపురం, కదిరి, మచిలీపట్నం, మదనపల్లె, మార్కాపురం, నందిగామ, నూజివీడు, ఒంగోలు, పెడన, పుంగనూరు, రాయచోటి, తాడిపత్రి, తిరువూరు, వినుకొండ, విజయనగరంలో రెండు రోజులకోసారి ప్రజలకు నీరు సరఫరా చేస్తున్నారు. కొన్ని చోట్ల నీటి లభ్యత తక్కువగా ఉన్నందున సరఫరా తగ్గించారు. రాబోయే రోజుల్లో వీటిలో కొన్ని చోట్ల మూడు రోజులకోసారి నీరు అందించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
పొదిలిలో ఏటా సమస్యే..
ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయతీలో ప్రతి వేసవిలోనూ తాగునీటి సమస్య ఏర్పడుతోంది. ప్రజలు తమ సమస్యను ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళుతున్నా శాశ్వత పరిష్కారం లభించడం లేదు. శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంటోంది.
* అన్నమయ్య జిల్లా మదనపల్లె పురపాలక సంఘంలోని 20, 21, 30, 31 వార్డుల్లో మూడు రోజులకోసారి నీటిని అందిస్తున్నారు.
* రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 500పైగా ఉన్న రక్షిత గ్రామీణ తాగునీటి పథకాల నిర్వహణకు ప్రభుత్వం సరిగా నిధులు విడుదల చేయడం లేదు. రూ.200 కోట్లకుపైగా బిల్లులు గత నాలుగైదు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో పథకాల నిర్వహణ బాధ్యత చూసే ప్రైవేటు సంస్థల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
అనంతపురం, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఒక్కో పథకం పరిధిలో వందల సంఖ్యలో గ్రామాలున్నాయి. ప్రైవేటు సంస్థలు నిర్వహణ బాధ్యతల నుంచి వైదొలిగితే నీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అనంతపురం, శ్రీసత్యసాయి, తూర్పుగోదావరి జిల్లాల్లో గత ఏడాది ఇలాంటి పరిస్థితే తలెత్తింది.
ఖాళీ బిందెలతో రోడ్లపైకి ప్రజలు
* అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో తాగునీటి సరఫరా సరిగాలేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. సాయినగర్, మెట్టబంగ్లా, ఐటీడీఏ కాలనీలకు నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఖాళీ బిందెలతో రెండు రోజుల క్రితం చింతపల్లిలోని గ్రామీణ తాగునీటి సరఫరా విభాగ ఇంజినీరింగ్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
* కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ శివారు కాలనీలకు నీటి సరఫరా అంతంత మాత్రంగా ఉంది. క్రాంతినగర్, హరిజనవాడ, లక్ష్మీపేట, రామయ్యకొట్టాల, సాయినగర్ తదితర కాలనీల్లో సమస్య తీవ్రంగా ఉంది. ఇటీవల కాలనీలకు చెందిన మహిళలు తాగునీటి సమస్యపై ధర్నా చేశారు.
ఇవీ చదవండి: