అటవీ హక్కుల చట్టం (ఆర్‌ఓఎఫ్‌ఆర్) ద్వారా హక్కు కల్పిస్తూ ప్రభుత్వం పట్టాలు అందిస్తోంది. తమ పొలం అని చెప్పుకొనేందుకు తప్ప ఆ పట్టాలతో ఉపయోగం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న పాసు పుస్తకాలకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. పంటల సాగుకు అవసరమైన సలహాలు, సూచనలు , రాయితీ విత్తనాలు ఇచ్చేందుకు వ్యవసాయశాఖ అధికారులు అటువైపు తొంగిచూడరు. అతికష్టం మీద పంట పండించినా.. విక్రయించుకునేందుకు సరైన మార్కెటింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉండదని గిరిజనులు చెబుతున్నారు. వందల ఎకరాలు ఇచ్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకునేందుకు తప్ప .. చెంచులకు దాని వల్ల కలిగే ప్రయోజనాలు నామమాత్రమే.
ఇప్పటి వరకు ఆరు వేల ఎకరాలు...
నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచు గిరిజనులకు గతంలో తాము నివాసం ఉంటున్న ప్రదేశాలకు, సాగు చేసుకుంటున్న పొలాలకు హక్కు ఉండేది కాదు. దీంతో అటవీశాఖ అధికారులతో ఇబ్బందులు తలెత్తేవి. ఆ సమస్యను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం 2005లో అటవీ హక్కుల చట్టాన్ని రూపొందించింది. రాష్ట్రంలో 2009 నుంచి దీన్ని అమలులోకి తెచ్చారు. 2005కు ముందు సాగులో ఉన్న భూములకుగాను గిరిజనులకు హక్కు కల్పిస్తూ పట్టాదారు పాసుపుస్తకాలు అందించడం ప్రారంభించారు. అలా ఇప్పటి వరకు 1523 మంది రైతులకు 6188 ఎకరాలకు హక్కు కల్పించారు.
వ్యవసాయ శాఖ సేవలు నిల్
ఐటీడీఏ పరిధిలో ఉన్న చెంచు గిరిజన గూడాల్లోని రైతులకు పంటల సాగుకు అవగాహన కల్పించే వారు కరవయ్యారు. గతంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు ఉండేవారు. వ్యవసాయాధికారి మరణించగా, ఉద్యాన అధికారి బదిలీ అయ్యారు. దీంతో ఆ రెండు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మైదాన ప్రాంతంలో రైతులకు అందించే సేవలు కొండ ప్రాంతంలో ఉండే గిరిజనులకు అందించడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా వాటిని భర్తీ చేయలేదు. ఎలాంటి పంటలు సాగు చేయాలి, పురుగు మందుల వినియోగం గురించి కనీస చెప్పే వారే లేకుండా పోయారు. ఆధునిక వ్యవసాయంపై వారికి అవగాహన లేకుండా పోయింది.
నేడు 980 మందికి పట్టాల పంపిణీ
నల్లమల అటవీ ప్రాంతంలో ఉంటున్న చెంచు గిరిజనులు, చెంచు గిరిజనేతరులకు మొత్తం 980 మందికి 2295 ఎకరాలకు సంబంధించి సోమవారం ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలను అందించనున్నారు. శ్రీశైలం ఐటీడీఏ ఆధ్వర్యంలో యర్రగొండపాలెంలో పంపిణీ చేయనున్నారు. 579 మంది చెంచు గిరిజనులకు 1476 ఎకరాలు, 401 మంది గిరజనేతరులకు 818 ఎకరాలకు పట్టాలు పంపిణీ చేస్తారు.
ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలకు రుణాలు కూడా ఇవ్వరు
ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాదారు పాసుపుస్తకాలకు బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు ఇవ్వడం లేదు. ఆ భూములు రెవెన్యూ పరిధిలో లేకపోవడంతో వాటికి 1బీ , అడంగల్ ఉండటంలేదు.
దీంతో బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. పంటల సాగుకు పెట్టుబడి లేక గిరిజనులు అప్పులు చేయడం లేదా ఖాళీగా వదిలేయడం చేస్తున్నారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అందించే వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలకు వర్తింపజేయడంతో కొంత ఉపశమనం కలిగింది.
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వైఎస్సార్ జలకళ పథకానికి చెంచు గిరిజనులు నోచుకోలేదు. ఆ గూడాలు ఉన్న పంచాయతీలు భూగర్భజలాలు అందుబాటులో లేవని గుర్తించారు. దీంతో గిరిజన రైతులకు ఆ పథకం వర్తించడం లేదు.
ఉపాధి హామీ పథకం ద్వారా అభివృద్ధి...
చెంచు గిరిజనులకు హక్కు కల్పించే భూములను ఉపాధి హామీ పథకం ద్వారా అభివృద్ధి చేస్తున్నాం. పంటల సాగుకు అవగాహన కల్పించే వ్యవసాయ, ఉద్యాన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీకి ప్రభుత్వానికి నివేదిక పంపాం. పట్టాదారు పాసుపుస్తకాలకు బ్యాంకుల నుంచి రుణాలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సాగుకు వీలుకాని భూములను ఉపాధి పనులతో చదును చేయిస్తున్నాం. ఇప్పటి వరకు 4470 ఎకరాల్లో ముళ్లచెట్ల తొలగింపు, 342 ఎకరాల్లో రాళ్ల తొలగింపు, 808 ఎకరాల్లో హద్దులకు ట్రెంచ్‌లు ఏర్పాటు చేయించాం. 2518 ఎకరాల్లో దుక్కి దున్నించడం వంటి పనులు చేయించాం.
- రామకృష్ణ, ప్రత్యేక అధికారి, శ్రీశైలం ఐటీడీఏ
ఇదీ చదవండి: నాణ్యత పెంచుకుంటూనే పెట్టబడి తగ్గించాలి: పొగాకు బోర్డు ఛైర్మన్