ఒంగోలు జీజీహెచ్‌లో కరోనా వార్డుల్లో వినియోగించే పీపీఈ కిట్లు, గ్లౌజ్‌లు, ఇతర వైద్య సామగ్రిని ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేయాల్సిందిపోయి మూటలు కట్టి ఓపీ ప్రవేశ ద్వారం వద్ద తరచూ గుట్టలుగా వేయడంపై రోగులు, వారి బంధువులు విస్తుపోతున్నారు. ఇటీవల ఎక్స్‌రే నిమిత్తం తీసుకెళుతుండగా మూడో అంతస్తు నుంచి దూకి యువకుడు ఆత్మహత్య చేసుకోవడం, పాజిటివ్‌తో ఆస్పత్రికి వచ్చిన వీఆర్‌ఏ కాంతారావు అనామకుడిగా ఆవరణలో విగతజీవిగా మారగా ఆయన చెవులు, ఇతర అవయవాలను కుక్కలు పీక్కుతినటం అందరినీ కలచివేశాయి. పాజిటివ్ వచ్చిన వీఆర్‌ఏను అంబులెన్సులో తీసుకొచ్చిన వారు ఆస్పత్రిలో ఎందుకు చేర్చలేదు. నాలుగు రోజులపాటు ఆయన ఎక్కడున్నారు. కుక్కలు పీక్కు తినే వరకు ఎందుకు గుర్తించలేదన్న అంశాలు అక్కడి లోపాలను ఎత్తి చూపుతున్నాయి. సక్రమంగా అడ్మిట్ రిపోర్టు ఉండటం లేదని, రోగులకు పడకలు దొరకాలంటే పడరాని పాట్లు పడాల్సివస్తోందని, ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు మాత్రమే కేటాయిస్తున్నారన్న విమర్శలూ ఉన్నాయి.
ఇటీవల ఒక టెక్నీషియన్ చనిపోవడం, 8 నెలల గర్భిణి అయిన కారంచేడు పీహెచ్‌సీ నర్సుకు సేవలు అందనందున మృతిచెందిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మార్చురీలోనే రోజులుగా కొన్ని మృతదేహాలు ఉండిపోవడం, మృతుల వివరాలను సకాలంలో తెలియజేయడంలేదని బంధువులు వాపోతున్నారు. ఇటీవల చీరాల, మార్కాపురానికి చెందిన ఇద్దరి మృతదేహాల విషయంలో ఇలానే జరిగింది.
రూ.350కి పెంచినా అదే తంతు
రోగులకు నాణ్యతలేని భోజనం, అల్పాహారం పెడుతున్నారని ఐసొలేషన్‌లో ఉన్న వారు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది వరకు రూ.150 ఉన్నప్పుడే నాణ్యత తప్ప అన్ని ఉండేవని, ఇప్పుడు గుత్తేదారు మారినా, రోగికి రోజు ఆహార ఖర్చు రూ.350కి పెంచినా నాణ్యత లేకపోగా... ముఖ్యమైన డ్రై ఫ్రూట్స్ పెట్టడంలేదని ఆరోపిస్తున్నారు. నీటి కొరతతో మరుగుదొడ్లకు వెళ్లేందుకూ ఇబ్బందులు తలెత్తుతున్నాయంటున్నారు. సాధారణ వార్డులే కాక ప్రత్యేక గదులు తీసుకున్న వారి పరిస్థితీ అంతేనన్న విమర్శలు లేకపోలేదు. హోం ఐసొలేషన్‌లో ఉండే వారికి కిట్లు ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఈ వరుస ఘటనలు, సమస్యలతో పెద్దాస్పత్రికి ఏమైందని, కరోనా నిధులను కూడా కొందరు ఆరగించడంవల్లనే ఇలాంటి పరిస్థితులు వచ్చాయనే ఆరోపణలు వినవస్తున్నాయి.
కలెక్టర్ పరిశీలన... పరిస్థితులపై ఆరా...
కలెక్టర్ పోలా భాస్కర్ బుధవారం సాయంత్రం జీజీహెచ్‌ను పరిశీలించారు. కొన్ని వార్డుల్లో నీరు సక్రమంగా రావడంలేదని వచ్చిన ఫిర్యాదులపై సమాచారం కోరారు. కొవిడ్, నాన్ కొవిడ్ వార్డుల్లో వైద్యుల విధులకు కేటాయింపు గురించి వివరాలు తెలుసుకున్నారు. డ్యూటీ రిజస్టర్‌ను చూశారు. వీఆర్‌ఏ మృతదేహాన్ని కుక్కలు కొరికిన ఘటనపై వివరణ అడిగారు. అభివృద్ధి పనులు తిలకించారు. కొవిడ్ ఓపీ విభాగం వద్ద వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా కూర్చొనేందుకు షెడ్డు నిర్మిస్తున్నారు. రోగులకు పడకలు సరిపోకపోతున్నందున కింది అంతస్తులో రెండు వార్డులు కేటాయించేందుకు చర్యలు చేపట్టారు. కలెక్టర్ వెంట సూపరింటెండెంట్ శ్రీరాములు, డిప్యూటీ సూపరింటెండెంట్ మురళీకృష్ణ, ఆర్‌ఎంవో వేణుగోపాలరెడ్డి, ప్రిన్సిపల్ రాజ్‌మన్నార్ తదితరులు ఉన్నారు.
అత్యవసరమైన రోగులకే పడకలు
పాజిటివ్ రోగుల సంఖ్య పెరుగుతున్నందున అత్యవసరమైన వారికి మాత్రమే పడకలు కేటాయిస్తున్నాం. తీవ్రత తక్కువ, లక్షణాల్లేని వారిని కొవిడ్ కేర్ సెంటర్లకు పంపుతున్నాం. కొందరిని హోం ఐసోలేషన్‌కు అనుమతిస్తున్నాం. అవసరాన్నిబట్టి పడకలను పెంచుకుంటూ వెళుతున్నాం. నాన్ కొవిడ్ పడకలను కూడా వినియోగించుకుంటున్నాం. భోజనం విషయంపై వస్తున్న ఆరోపణలపై గుత్తేదారుతో మాట్లాడాం. మెనూ ప్రకారం, నాణ్యమైన ఆహారం అందించకపోతే నోటీసులు ఇస్తామని హెచ్చరించాం. రోగులకు రోజూ చికెన్, రాత్రి గుడ్డు, ఆహారం అందించేలా చూస్తున్నాం. జీజీహెచ్ చరిత్రలో ఎప్పుడూ ఇంతమంది లేరు. మంది ఎక్కువ కావడంతో నీటి కొరత ఏర్పడింది. పంపులు, విద్యుత్తు వైరింగ్ పనులు నిర్వర్తించే వారు తక్కువ మంది ఉన్నారు. వైద్యులతోపాటు ఇతర విభాగాల వారూ సమయం చూసుకోకుండా పనిచేయడం ద్వారా అందరూ అలసిపోతున్నారు. అయినా సేవలకు లోటు రానీయకుండా చూస్తున్నాం. ఒకేసారి 20 మందికి పాజిటివ్ రావడంతో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తాయి. హోం ఐసోలేషన్ కిట్లు ప్రభుత్వం నుంచి ఇంకా రాలేదు. మెడికేషన్ కిట్లు మాత్రం అందజేస్తున్నాం. - డాక్టర్ శ్రీరాములు, పర్యవేక్షణాధికారి, జీజీహెచ్
ఇవీ చదవండి...