EBC Nestam Funds: సంక్షేమ పథకాల వార్షిక క్యాలండర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ క్యాలెండర్‌ను అనుసరించి ఈ నెల 12వ తేదీన ఈబీసీ నేస్తం నిధుల్ని లబ్దిదారుల ఖాతాలకు ముఖ్యమంత్రి జగన్ జమ చేయనున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈబీసీ నేస్తం నిధులను లబ్దిదారుల ఖాతాలకు బటన్ నొక్కి పంపిణీ చేయనున్నారు. బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనార్టీ, కాపులతోపాటు అగ్రవర్ణాల్లోని పేదలకు ఆర్థిక సాయాన్ని అందించే పథకంగా ఏడాదికి 15 వేల రూపాయల్ని లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం జమ చేస్తోంది. 45 నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు ఉన్న మహిళలకు ప్రభుత్వం ఈ ఆర్థిక సాయాన్ని అందించనుంది.
మార్కాపురంలో ఏర్పాట్లు పూర్తి: వైఎస్సార్ ఈబీసీ నేస్తం రెండవ విడత నగదు జమ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం జగన్ ప్రకాశం జిల్లా మార్కాపురం రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి జగన్ బయలుదేరి 9.55 గంటలకు మార్కాపురం చేరుకుంటారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్‌కు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఎస్వీకేపీ కళాశాల మైదానంలో బహిరంగ సభ కోసం ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకుంటారు. ఆ వేదికపై నుంచే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం ఈబీసీ నేస్తం లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలకు నగదు జమచేయనున్నారు. ఆ కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.
ముఖ్యమంత్రి పర్యటన.. చెట్ల తొలగింపు: ముఖ్యమంత్రి పర్యటన అంటేనే బందోబస్తు భారీగా ఉంటుంది. కానీ జగన్ పర్యటనలో మాత్రం అందుకు భిన్నంగా రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించడం, రోడ్లపై ఉన్న షాపులను మూసివేయించడం పరిపాటి అయిపోయింది. పర్యావరణను కాపాడాల్సిన అధికారులే.. ముఖ్యమంత్రి జగన్ పర్యటనలో అడ్డొస్తున్నాయని నరికేస్తున్నారు. ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. తాజాగా మార్కాపురం పర్యటనలో సైతం చెట్లను అధికారులు తొలిగించేశారు. హెలిప్యాడ్ స్థలం వద్ద ఉన్న చెట్లను తొలగించారు. హెలికాఫ్టర్ ల్యాండింగ్‌కు దూరంగా ఉన్న కూడా భద్రతా దృష్ట్యా చెట్లను నరికేశారు. అయితే నీడనిచ్చే చెట్లను ముఖ్యమంత్రి ఒక్కరోజు పర్యటన వల్ల తొలిగించడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన అధికారులే.. సీఎం పర్యటన ఉందని చెట్లను నరకడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: