Class War in YSRCP Leaders : వైఎస్సార్సీపీ కంచుకోటలు బద్దలవుతున్నాయి. ఆ పార్టీకి తిరుగులేని ఆధిక్యం తీసుకొచ్చిన ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వైఎస్సార్సీపీ కోటలు బీటలు వారుతున్నాయి. గత ఎన్నికల్లో నెల్లూరులో స్వీప్ చేసిన వైఎస్సార్సీపీకి ఇప్పుడు అక్కడ అభ్యర్థులను ఖరారు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు పార్టీని వీడారు. ఉన్న వారిలోనూ ఇద్దరు ఎమ్మెల్యేలు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవరని వైఎస్సార్సీపీ నేతలే బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడడంతో వారి స్థానాల్లో కొత్తగా నియమించిన సమన్వయకర్తల్లో ఒకరు చివరి వరకూ ఉంటారా మధ్యలోనే ఝలక్ ఇస్తారా అనే చర్చ జరుగుతోంది.
YSRCP Leaders Fire in CM Jagan : నెల్లూరులో ఎంపీ ఆదాలను గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. దీంతో ఇప్పుడు ఆ పార్టీకి ఎంపీ అభ్యర్థి కరవయ్యారు. ఇంతకాలం పార్టీకి ఆర్థికంగా అండదండలందించిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని ఈసారి నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా పోటీకి అయితే ఒప్పించారు. ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు కూడా కానీ, ఇప్పుడు ఆయన అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు చోట్ల ప్రస్తుతమున్న సిటింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని పట్టుబట్టారని సమాచారం. వారినే పోటీ చేయిస్తే తాను పోటీ చేయడంపై పునరాలోచించుకోవాల్సి ఉంటుందనే సంకేతాలను ఆయన అధినాయకత్వానికి పంపారని అంటున్నారు.
CM Jagan Changing Constituency in Charge : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే ఏడు స్థానాల్లో మార్పులు చేర్పులకు సీఎం జగన్ నిర్ణయించారు. సిటింగ్‌లకు ఆ విషయాన్ని ఇప్పటికే చెప్పేయడంతో వారు భగ్గుమంటున్నారు. పెడన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జోగి రమేష్‌ను ఈసారి మరోచోటికి మారుస్తున్నట్లు పార్టీలో చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పెడన నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు, ZPTCలు, MPTCలు, పార్టీ నేతలు శనివారం సమావేశమయ్యారు. జోగిని మారిస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ అధినాయకత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఈ సమావేశం, అందులో ఆ నేతల నిర్ణయం వెనుక మంత్రి జోగి మంత్రాంగం ఉందనే చర్చ జరుగుతోంది.
వైఎస్సార్సీపీ లీగల్ సెల్లో వర్గ విభేదాలు - కష్టకాలంలో పార్టీకి పని చేస్తే గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన
YSRCP Changing Constituency in Charge For Elections : మైలవరంలో సిటింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను కొనసాగిస్తారా లేదా అనే విషయంలో స్పష్టత రావడం లేదు. ఆ స్థానం ఆశించిన మంత్రి జోగి రమేష్ అక్కడ గత కొంతకాలం తెర వెనుక రాజకీయం చేశారు. దీంతో మంత్రి, ఎమ్మెల్యే వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది. పార్టీ అధిష్ఠానం, CMO జోగిని పిలిచి సర్దుబాటు చేసే ప్రయత్నం చేశాయి. అప్పటికి సద్దుమణిగినా మైలవరంలో ఎమ్మెల్యేతో మంత్రికి వర్గపోరు పూర్తిగా సమసిపోలేదు. ఇప్పుడు సమన్వయకర్తల మార్పుల నేపథ్యంలో సీఎంఓ నుంచి పిలిచినా ఎమ్మెల్యే అందుబాటులోకి రావడం లేదని సమాచారం.
రామచంద్రపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వేణుగోపాలకృష్ణను ఇప్పుడు రాజమహేంద్రవరం గ్రామీణకు మార్చారు. రామచంద్రపురం టికెట్ తనకు దక్కకపోవడానికి అక్కడున్న ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, MLC తోట త్రిమూర్తులు కారణమని ఆగ్రహంతో ఉన్న మంత్రి వేణు తన కార్యకర్తలతో మాట్లాడారు. రామచంద్రపురంలో మళ్లీ అశాంతి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మీరంతా అడ్డుకోండని కార్యకర్తలకు చెప్పారు. తోట, బోస్ వర్గాలు అరాచకాలు చేస్తున్నాయని చెప్పకనే చెప్పారు.
ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీలో వైవీ వర్సెస్ బాలినేని-మాగుంట : ప్రకాశం జిల్లా మాజీ MP వైవీ సుబ్బారెడ్డి, మాజీమంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గ్రూపులుగా చీలిపోయింది. అద్దంకి, కొండపి నియోజకవర్గాల సమన్వయకర్తలిద్దరినీ వైవీ మార్పించారని బాలినేని వర్గం గుర్రుగా ఉంది. జిల్లాలో ఆయన ఆధిపత్యం ఎక్కువవుతుండడంతోపాటు ఒక ఎంపీ, ఒక అసెంబ్లీ సీటు ఆయన తనకు, తన కొడుకు కోసం అడుగుతున్నారనే అంశం పార్టీలో ఆజ్యాన్ని పోసింది. మరోవైపు తన సీటుకే ఎసరు పెడుతున్నారని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఆయనకు బాలినేని మద్దతునిస్తున్నారు.
రాయదుర్గంలో రచ్చకెక్కిన వైఎస్సార్సీపీ వర్గపోరు - నడిరోడ్డుపై పరస్పర దూషణలు
దీంతో ఇప్పుడు వైవీ వర్సెస్ బాలినేని-మాగుంట అన్నట్లు మారింది. కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు, కొండపి మాజీ సమన్వయకర్త మాదాసు వెంకయ్య హైదరాబాద్‌కు వెళ్లి మరీ బాలినేని కలిసి వచ్చారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి బాలినేని వెంటే ఉంటున్నారు. ఒంగోలు అసెంబ్లీ స్థానానికి బాలినేని, అక్కడే లోక్‌సభ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులురెడ్డి కొనసాగనున్నారా లేదా అనేదానిపై ఈ నెల 28న పార్టీ అధినేత జగన్ స్పష్టత ఇవ్వనున్నారని తెలిసింది. ఆలోపు వారిద్దరికీ విధేయతను చాటుకునే పరీక్ష పెట్టారనే ప్రచారం జరుగుతోంది.
సర్వేలో ఏముందో ఏవరికి తెలుసు : జగ్గంపేటలో సిటింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును తప్పించి ఆయన స్థానంలో తోట నరసింహంను సమన్వయకర్తగా నియమిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి మధ్య వర్గపోరు తీవ్రస్థాయిలో ఉంది. ఇప్పుడు టికెట్ మారడంతో చంటిబాబు అసంతృప్తితో ఉన్నప్పటికీ బయటపడడంలేదు. తన కేడర్ మనోభావాలు దెబ్బతినకుండా నడుచుకుంటే అంతా సక్రమంగా ఉంటుందని లేకపోతే వారి అభిప్రాయాలకు అనుగుణంగా కార్యాచరణ ఉంటుందని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేకు సంబంధించిన కార్యకర్తలను కలుపుకొని వెళతారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. తన లాగా ఏ ఎమ్మెల్యే కష్టపడి ఉండరని నియోజకవర్గంలో 269 రోజులపాటు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించానని పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అంటున్నారు. సర్వేలో ఏముందో, ఎలా చేశారో ఇప్పటికిప్పుడు కొత్త వ్యక్తిని తీసుకువస్తే ఇక్కడ కేడర్ వారితో ఇమడదని చిట్టిబాబు స్పష్టం చేస్తున్నట్లు సమాచారం.
మంత్రి వర్గీయులు తీవ్ర ఆగ్రహం : ఆలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుమ్మనూరు జయరాంకు ఈసారి అక్కడ టికెట్ ఉండదని సీఎం ఇప్పటికే సంకేతమిచ్చినట్లు ప్రచారంలో ఉంది. దీనికితోడు నియోజకవర్గంలో తిరగాలని ZPTC సభ్యుడు విరూపాక్షికి సీఎం చెప్పడంతో మంత్రి వర్గీయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ జన్మదినం సందర్భంగా ఈ నెల 21న ఆస్పరిలో విరూపాక్షి వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వీరు చించేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇప్పుడు మంత్రికి టికెట్ రాకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అని చర్చలు పెరిగాయి.
కాసు వద్దు-జంగా ముద్దు స్థానికులకే టికెట్ ఇవ్వాల్సిందే : గురజాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, శాసనమండలిలో ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తి బీసీ కోటాలో టికెట్ రేసులో ఉన్నారు. ఇటీవల పల్నాడు బలహీనవర్గాల ఐక్యవేదిక భేటీ’ నిర్వహించారు. ఆ భేటీకి పార్టీ శ్రేణులు వెళ్లరాదంటూ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి హుకుం జారీ చేయడంతో పాటు ఎవరూ అటువైపు వెళ్లకుండా నియంత్రించడంతో కృష్ణమూర్తి తీవ్రంగానే స్పందించారు. గురజాలలో అరాచకం నడుస్తోంది. డబ్బు అహంకారం నెత్తికెక్కితే ప్రజలే బుద్ధి చెబుతారంటూ ఘాటుగానే హెచ్చరించారు. ఈ సమావేశంలో కాసు వద్దు-జంగా ముద్దు స్థానికులకే టికెట్ ఇవ్వాలంటూ అందరూ నినాదాలూ చేశారు.
అధిష్ఠానానికి పరోక్షంగా హెచ్చరికలు : సీట్లపై సీఎం జగన్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూనే పలువురు ఎమ్మెల్యేలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు తమదేనని, వచ్చే ఎన్నికల్లో తాము అక్కడి నుంచే పోటీ చేస్తామని ప్రకటించడం ద్వారా పార్టీ అధిష్ఠానానికి పరోక్షంగా హెచ్చరిక జారీ చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు తనదేనని మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాస్, పొన్నూరు నుంచే పోటీ చేయబోతున్నానంటూ అక్కడి ఎమ్మెల్యే కిలారి రోశయ్య ప్రకటించారు. గిద్దలూరు కోరుకుంటున్నప్పటికీ బాలినేని కూడా ఇప్పటికే పలుమార్లు తన సిటింగ్ స్థానమైన ఒంగోలు నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు.