APGEF president on PRC: ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగానే స్పందిస్తుందని ఏపీజీఈఏ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఇప్పటికి పలుమార్లు సమావేశం నిర్వహించి వాటిపై చర్చిస్తోందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ కూడా ప్రభుత్వానికి సమన్వయంగా పనిచేస్తూ సహకరించాలని కోరారు. ఉద్యోగుల అనేక సమస్యలను పరిష్కరించిందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన సంఘం ప్రథమ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నాపై తప్పుడు ఆరోపణలు..
venkatarami reddy: అంతకుముందు పాత జడ్పీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. గత ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించిన కొన్ని సంఘాల నాయకులు ప్రభుత్వంపైనా, తనపైన విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. తనకు ఉద్యోగుల మద్దతు లేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంఘం నాయకుల సొంత జిల్లాలో జరిగిన సభలకు ఇలాంటి మద్దతు ఎప్పుడైనా లభించిందా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో పోలవరానికి జనాలను తరలించారని వారికి సిగ్గుందా అని నిలదీశారు. ముఖ్యమంత్రి జగన్తో అనేక సార్లు ఉద్యోగుల సమస్యలపై చర్చించానని అన్నారు. ఉద్యోగులకు ఇలాంటి సానుకూలమైన ప్రభుత్వం ఎప్పుడూ లేదన్నారు.
వారం లేదా పదిరోజుల్లో పీఆర్సీ ప్రకటన..
venkatarami reddy on PRC: పీఆర్సీ ప్రకటనకు మీకంతా తొందరెందుకు.. వారం పది రోజుల్లో ప్రకటిస్తామని వెంకట్రామిరెడ్డి చెప్పారు. ఇన్నాళ్లు ఆగాం కదా.. మరికొద్ది రోజులు ఆగలేమా అని ప్రశ్నించారు. కొందరు ఉద్యోగులు వారి ఉనికి కోసం ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నారని.. అది సరికాదన్నారు. పీఆర్సీ, డీఏ బకాయిలు వంటి సమస్యలు కొంత ఆలస్యం అయిన మాట వాస్తవమేనని చెప్పారు. రాష్ట్రంలో 13 లక్షల మంది ఉద్యోగులు మా వైపు ఉన్నారంటూ ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేయడం సరికాదన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రెండున్నరేళ్లలో తాను ఒక్క పైసా కూడా సంపాదించలేదని.. మీ ఆస్తులు, నా ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు సిద్ధమని వెంకట్రామిరెడ్డి సవాల్ విసిరారు.
చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చాం. పీఆర్సీ చాలా ఆలస్యమైంది. కరోనా వల్ల ఇలా జరిగింది. వారం రోజుల్లోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం స్పందించినా కూడా నిరసనలు చేయడం దారుణం. ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం చూస్తున్నాం. అప్పటి సీఎం ఉద్యోగులను తిట్టినా ఎవరూ స్పందించలేదు. ఎప్పుడు ప్రశ్నించని నాయకులు ఇప్పుడు బాక్ మెయిలింగ్ చేస్తున్నారు. మేం 13 లక్షల మంది ఉన్నామని చెప్పుకుంటున్నారు. రెవెన్యూలో సంఘం నాయకులు ఎవరున్నారు? మీకు మీరే స్టేట్మెంట్లు ఇస్తారా? నా ఆస్తులపై ఏసీబీ విచారణకు సిద్ధం? మీరు సిద్దమా? - వెంకట్రామిరెడ్డి, ఏపీజీఈఎఫ్ అధ్యక్షుడు