ఏడాది కాలంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారంజితమైన పాలన అందిస్తున్నారని ప్రకాశం జిల్లా చీరాల వైకాపా నేత ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తైన సందర్భంగా చీరాల గడియార స్తంభం కూడలిలో వైకాపా శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వైయస్ విగ్రహానికి పూలమాలలు వేసిన ఆమంచి కృష్ణమోహన్ పార్టీ జెండా ఎగురవేశారు.
గతంలో సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాలంటే జన్మభూమి కమిటీల ద్వారా వారు సిఫార్సు చేసిన వారికే దక్కేవని ఆమంచి ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం ప్రతి పేదవాడి ఇంటికి వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు అందజేస్తుందని కొనియాడారు. తెదేపా అధినేత చంద్రబాబు తన కుమారుడిని మంగళగిరిలో గెలిపించుకోలేక పోయారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి నచ్చి పార్టీలో చేరేందుకు తెదేపా నాయకులు క్యూ కడుతున్నారని ఆమంచి తెలిపారు.
కనపించని భౌతిక దూరం
ఈ కార్యక్రమంలో వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ గుంపులు గుంపులుగా చేరి.. భౌతిక దూరం పాటించకుండా సంబరాలు జరిపారు. ఈ క్రమంలో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
ఇదీ చదవండి: