ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం అక్కాయిపాలెంకు చెందిన ఎన్.పద్మ అనే మహిళకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. అదే గ్రామానికి చెందిన అన్నమయ్య అనే యువకుడు గత ఏడాది డిసెంబరు 12న ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. కేసు పెడితే ఇబ్బందులు తలెత్తుతాయని ఆ యువకుడి కుటుంబ సభ్యులు వేడుకోవటంతో పంచాయతీ పెద్దలు సమస్యను పరిష్కరించి...అతనిని గ్రామం నుంచి పంపించి వేశారు.
వారం కిందట గ్రామానికి తిరిగొచ్చిన అన్నమయ్య మళ్లీ వేధింపులు మెుదలుపెట్టాడు. మాజీ ఎమ్మెల్యే అండ తనకుందని.. మీరేమి చేయలేరని బాధితురాలి కుమారులతో గొడవకు దిగాడు. ఈ నేపథ్యంలో అన్నమయ్య రెండ్రోజుల క్రితం ఆస్పత్రిలో చేరి..సదరు మహిళ భర్త, కుమారులు తనపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు వేటపాలెం పోలీసులు కేసు నమోదు చేసి...ఆమె భర్త, కుమారులను స్టేషన్కు తీసుకొచ్చారు. ఆమె కూడా స్టేషన్కు వెళ్లింది. తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పేందుకు ప్రయత్నించినా...ఎవరూ పట్టించుకోలేదని ఎమ్మెల్యే కరణం బలరాం ముందు వాపోయింది. కేవలం రాజకీయ అండ చూసుకుని పోలీసులు తన కుటుంబాన్ని వేధిస్తున్నారని, న్యాయం చేయాలని భాధితురాలు విన్నవించుకుంది.
అన్నమయ్యపై సదరు మహిళ భర్త, కుమారులు తీవ్రంగా దాడిచేసి గాయపరిచారని బాధితుడి ఫిర్యాదుతోనే కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న సమయంలో భాధిత మహిళ స్టేషన్కు వచ్చారని... కేసు నుంచి తమ వారిని తప్పించాలని కోరారే తప్ప ఎటువంటి ఫిర్యాదు చెయ్యలేదని వేటపాలెం ఎస్‍ఐ అజయ్ బాబు తెలిపారు.
ఇవీ చదవండి...ఆరేళ్ల బాలిక పట్ల అసభ్యప్రవర్తన... వ్యక్తి అరెస్టు !