నెల్లూరు జిల్లా పోలీసులు.. ఆపదలో ఉన్న ఓ యువతిని దిశ (disha) యాప్ సహాయంతో.. కాపాడారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన 21ఏళ్ల యువతి.. శ్రీ సిటీలో ఉద్యోగం చేస్తోంది. సొంతూరు నుంచి శ్రీసిటీకి వెళ్లేందుకు రాత్రి 9.30 గంటలకు ఆ యువతి నాయుడుపేట బస్ స్టాండుకు వచ్చింది. అక్కడి నుంచి బస్సులు లేకపోవడంతో ఆటోలో సుళ్లూరుపేట వెళ్లేందుకు పయనమైంది. ఆటోలో వెళ్తుండగా డ్రైవర్ ప్రవర్తనపై ఆమెకు అనుమానం కలిగింది.
దారిలోనే నేలబల్లి హైవేపై ఆ యువతి ఆటో దిగేసింది. జాతీయ రహదారిపై రాత్రి సమయంలో ఎటు పోవాలో దిక్కుతోచని ఆ యువతి... సోదరికి ఫోన్లో సమాచారమిచ్చింది. దీంతో కంగారుపడ్డ యువతి సోదరి.. దిశ యాప్ ద్వారా వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. నిమిషాల వ్యవధిలో వారు.. ఆ యువతి వద్దకు చేరుకున్నారు. పోలీసులే సూళ్లూరుపేటలోని హాస్టల్లో క్షేమంగా దింపారు.
సమాచారం వచ్చిన వెంటనే.. ఆపదలో ఉన్న యువతిని నిమిషాల వ్యవధిలో రక్షించిన పోలీసులను... సౌత్ కోస్టల్ డీఐజీ త్రివిక్రమ వర్మ అభినందించి రివార్డులు అందించారు. మహిళలందరూ దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని డీఐజీ కోరారు.
ఇదీ చదవండి:
FLOOD: గోదావరి నదికి పోటెత్తిన వరద.. నీటిలోనే లోతట్టు ప్రాంతాలు