Anil and uncle clash: నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్ మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఇప్పటికే ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటుండగా.. రూప్‌కుమార్ అనుచరుడు హాజీపై కొందరు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఎమ్మెల్యే అనిల్‌కుమారే కిరాయి మనుషులతో దాడి చేయించారని రూప్‌కుమార్ ఆరోపించారు. మేమంతా కష్టపడి ఎన్నికల్లో అనిల్‌కుమార్‌ను గెలిపిస్తే ఇప్పుడు మాపైనే దాడి చేశారని రూప్‌కుమార్ మండిపడ్డారు. మేం ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెడితే అది నీ ఊహకే అందదంటూ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ను ఘాటుగా హెచ్చరించారు.
మరోవైపు.. నగరంలో ఎవరు ఎవరిపై దాడి చేసినా.. తనకే అంటగడుతున్నారని ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నోరు విప్పితే వారి చరిత్రలన్నీ బయటకు వస్తాయని హెచ్చరించారు. రూప్‌కుమార్ ఒక అంతర్జాతీయ దొంగని.. నోటీసులు వచ్చిన సంగతి మర్చిపోవద్దంటూ అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెట్టింగ్ వ్యవహారంలో కొందరు చేసిన పాపాలకు ఇప్పటికీ తాను భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా ఇరువురు నేతలను పిలిచి సీఎం జగన్ సర్దిచెప్పారు. కలిసి పని చేయాలని సూచించారు. ఇది జరిగిన పది రోజులకే ఇరువురు నేతలు వీధికెక్కారు.
"నాతో ఉన్నాడన్న ఒకేఒక్క కారణంతో నా అనుచరుడు హాజీపై హత్యాయత్నం చేయటం జరిగింది. నెల్లూరు జిల్లాలో ఇంతకుముందు ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ లేదు. కార్పొరేటర్ నాగరాజు ఇంటిపై అర్ధరాత్రి దాడి, ముస్లిం మైనార్టీ నాయకుడు మున్మర్ షాప్‌ను అర్ధరాత్రి దొంగతనంగా పగలగొట్టారు. ముస్లిం మైనార్టీ కార్పొరేటర్ ఇంతియాజ్ ఆఫీస్‌పైన చేసిన దాడిని కళ్లారా చూశాము. ఇప్పుడేమో హత్యాయత్నం.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన మాకా ఇలాంటి పరిస్థితి..? మేము ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెడితే అనిల్‌కుమార్ తట్టుకోలేరు." - రూప్‌కుమార్ యాదవ్, నెల్లూరు డిప్యూటీ మేయర్
"ప్రతి ఒక్క కార్యకర్త నా కోసం కష్టపడి పని చేస్తేనే నేను ఇప్పుడు ఎమ్మెల్యేను అయ్యాను. ఎవరో ఒకరు ఏదో మాట్లాడితే నాకేం కాదు. బెట్టింగ్ వ్యవహారంలో కొందరు చేసిన పాపాలకు ఇప్పటికీ నేను భరించాల్సి వస్తోంది. ఇప్పటికీ నేను మాట్లాడుతుంటే చాలా మంది 'బెట్టింగ్ బంగార్రాజు' అని కామెంట్స్ చేస్తున్నారు.. ఆ పాపం ఎవరో చేస్తో.. నేను భరిస్తున్నాను. నగరంలో ఎవరు దాడి చేసినా.. నాకే అంటగడుతున్నారు. నేను నోరు విప్పితే వారి చరిత్రలన్నీ బయటకు వస్తాయి. నేను కూడా మీలా దిగజారి మాట్లాడాల్సి వస్తే.. అంతర్జాతీయ నోటీసులు వచ్చిన విషయం గురించి లీకులు ఇవ్వటానికి నాకు 5 నిమిషాలు పట్టదు." - అనిల్‌కుమార్ యాదవ్, వైకాపా ఎమ్మెల్యే
ఇవీ చదవండి: