కృష్ణా జలాల వివాదం ఎవరు సృష్టించారో అందరికీ తెలుసని.., దాదాగిరి ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సాగు అవసరాలకు కాకుండా విద్యుత్తు ఉత్పత్తికి ప్రాజెక్టులో నీరు వాడకూడదని మార్గదర్శకాలున్నా.. 30 టీఎంసీల నీటిని తెలంగాణ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఖర్చు చేసిందన్నారు. అడ్డగోలుగా నీటిని సముద్రం పాలు చేసిన తెలంగాణదే దాదాగిరి అని విమర్శించారు. ఈ మేరకు నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలను 80 అడుగుల ఎత్తులో నిర్మించి సుమారు 12 లక్షల కొత్త ఆయకట్టును తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. దాన్ని గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించి చాలా వరకు పూర్తి చేసినా.. నాడు ఇక్కడున్న తెదేపా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఎగువ ప్రాంతంలో ఉన్నామన్న భావనతో తెలంగాణ జల వివాదానికి దిగుతోందన్నారు. కృష్ణా జలాల్లో ఏపీ వాటాను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రయత్నించారన్నారు. కార్యక్రమంలో మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, అనిల్‌కుమార్ ఉన్నారు.
కేసీఆర్ ఏమన్నారంటే..
కృష్ణా జలాలపై ఏపీ ప్రభుత్వం దాదాగిరి చేస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోందని మండిపడ్డారు. కృష్ణా జలాలపై రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతామన్నారు. సాగర్ ఉపఎన్నిక సమయంలో ఇచ్చిన హామీల అమలుపై సమీక్షించేందుకు హాలియాకు విచ్చేసిన సీఎం కేసీఆర్.. అక్కడ ఏర్పాటు చేసిన ప్రగతి సమీక్షాసమావేశంలో ప్రసంగించారు.
ఇదీ చదవండి
Vishaka Steel: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వబోం: ఎంపీ విజయసాయి