రేషన్ సరుకులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని నెల్లూరు జిల్లా ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద మహిళలు నిరసన తెలియజేశారు. పట్టణంలోని దేవలాల గడ్డ, తుఫాన్ నగర్ వీధుల్లో 200 మంది వరకు రేషన్ కార్డుదారులు ఉన్నారు. కేవలం ఒక్కరోజే నిత్యావసర సరుకుల పంపిణీ వాహనం ఇంటికి వచ్చి వెళ్తోందని.. నామమాత్రంగా కార్డుదారులకు సరుకులు పంపిణీ చేస్తున్నారని ఆగ్రహించారు. ఆ తర్వాత అటు వైపే రావడం లేదని మహిళలు మండిపడ్డారు. కార్డుదారులకు కందిపప్పు ఇవ్వడం లేదని.. ఎందుకని ప్రశ్నిస్తే ఆపరేటర్ తిరిగి తమనే బెదిరిస్తున్నాడని వాపోయారు.
కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే తమకు రేషన్ సరుకులు అందని కారణంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని చెప్పారు. సమస్యను స్థానిక వాలంటీర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకుండా పోయిందని.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న మొబైల్ వాహన ఆపరేటర్‌పై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ హరనాథ్‌కు వినతి పత్రం అందజేశారు. వెంటనే స్పందించిన తహసీల్దార్.. వీఆర్వోతో పాటు డీలర్‌ను పిలిపించి మాట్లాడారు. కార్డుదారులకు సరుకులు అందేలా చూడాలని ఆదేశాలిచ్చారు.
ఇదీ చదవండి: