Nellore District News: నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తి గ్రామ మాజీ సర్పంచ్, వైకాపా నేత వెంకట సుబ్బారెడ్డి ఇంటిపై పెట్రోల్ పోసి.. ఓ మహిళ నిప్పంటించింది. మంటలు ఎగిసిపడటంతో వెంకటసుబ్బారెడ్డి ఆయన భార్య సునీతమ్మ తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం వేళ సుబ్బారెడ్డి ఇంటి వద్దకు వచ్చిన ఓ మహిళ.. తలుపులు వేసి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారైంది. ఆ సమయంలో వెంకటసుబ్బారెడ్డి దంపతులు ఇంట్లోనే ఉన్నారు.
ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో ఇంట్లో ఉన్న భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. మంటలను గుర్తించిన స్థానికులు.. సుబ్బారావు దంపతులను రక్షించి చికిత్స నిమిత్తం నెల్లూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మంటల తీవ్రతకు ఇంట్లోని సామాగ్రితోపాటు బయట ఉన్న కారు దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గ్రామానికి చెందిన సుగుణ అనే మహిళకు.. వెంకటసుబ్బారెడ్డికి మధ్య ఉన్న విభేదాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుబ్బారెడ్డిని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పరామర్శించారు. నిందితులను త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.
ఇదీ చదవండి: PUB RAID CASE : పుడింగ్ పబ్‌లోకి కొకైన్ ఎలా వచ్చింది? తీసుకొచ్చింది ఎవరు?