నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని శంకర్ నగరం వద్ద కొమ్మలేరు వాగులో నిర్మించిన డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది. నీరు, చెట్టు పథకం కింద గత ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణం కోసం సుమారు 48 లక్షలతో పనులు చేపట్టింది. ఈ పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్... రాకపోకల కోసం వాగులో ప్రత్యామ్నాయంగా డైవర్షన్ రోడ్డును ఏర్పాటు చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొమ్మలవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగు ఉద్ధృతికి నాసిరకంగా నిర్మించిన డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది.
రెండు గ్రామాల పొలాలకు వెళ్లిన రైతులు అవతలి వైపునే చిక్కుకుపోయారు. సంఘటనాస్థలానికి చేరుకున్న ఇరిగేషన్ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. 500 ఎకరాల పొలాలు కొమ్మలేరు అవతలి వైపు ఉన్నాయన్నారు. రెండు గ్రామాలకు ప్రధాన రహదారి అయిన బ్రిడ్జి నిర్మాణంలో అలసత్వం ఏంటని నిలదీశారు. డైవర్షన్ నిర్మాణం చేపడుతున్నప్పుడు... కాంట్రాక్టర్కు తాము ఎన్నిసార్లు చెప్పినా వినలేదని వాపోయారు. నిర్మాణం చేపట్టే సమయంలో అధికారులు పట్టించుకోకపోవడం వల్లే కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా వ్యవహరించాడని మండిపడుతున్నారు.
ఇదీ చదవండి:"సబ్ కమిటీ నివేదికతో... పోలవరం అక్రమాలు బట్టబయలు"