నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, కోవూరు, కావలి, గూడూరు నియోజకవర్గాల్లో సుమారు 169 కిలోమీటర్ల తీరప్రాంతమున్నా.. గుక్కెడు మంచినీళ్లకు నోచుకోలేకపోతున్నారు. క్యానుకు 20 రూపాయలు చెల్లించి నీరు కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల భూగర్భజలాలాన్నీ అడుగంటిపోయాయి. గతంలో.. పది పన్నెండు అడుగులు తవ్వితే బోర్లు పడేవని ఇప్పుడు వంద అడుగుల వరకూ వేసినా.. నీటి జాడ అనుమానమేనని గ్రామస్థులు వాపోతున్నారు. పరిశ్రమల నుంచి విడుదలయ్యే... వ్యర్థాల వల్ల వాగులు, వంకలు కలుషితం అవుతున్నాయంటున్నారు.
తోటపల్లి గూడూరులోని శివరామపురం చిల్లకూరు మండలంలోని గుమ్మళ్లదిబ్బ... ముత్తుకూరు మండలంలోని నెలటూరు, హరిజనవాడల్లో భూగర్భజలాలు ఉప్పు మయంఅయ్యాయి. ఆయా ప్రాంతాల చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలు కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు సద్వినియోగం చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ గ్రామాల్లో శుద్ధనీటి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.