లాక్‌డౌన్ కారణంగా విద్యార్థిలోకం తరగతులకు దూరమవడంతో పరీక్షల సాధన (ప్రిపరేషన్) ప్రక్రియ గాడితప్పింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ‘పది’ విద్యార్థుల కోసం ప్రత్యేక బోధన కార్యాచరణను ఆచరణలోకి తీసుకువచ్చింది. ‘విద్యామృతం’ పేరిట టీవీలో సబ్జెక్ట్ టీచర్లతో తరగతులను ప్రత్యక్ష ప్రసారం చేయిస్తోంది. నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది సుమారు 38 వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయడానికి సిద్ధమయ్యారు.
లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికే రెండు సార్లు పరీక్ష తేదీలు వాయిదా పడ్డాయి. విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో దూరదర్శన్ సప్తగిరి ఛానల్‌లో ప్రతి రోజూ రెండు గంటలు నిపుణులతో పాఠాలు బోధిస్తున్నారు. మే 12 వరకు రోజూ 30 నిమిషాలు రేడియోలోను ప్రత్యేక తరగతులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. సప్తగిరి ఛానల్‌లో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు రెండు పూటలా ఒక్కో పాఠ్యాంశంపై ఆయా ఉపాధ్యాయులతో నిర్వహించే తరగతులను ప్రత్యక్ష ప్రసారం చేయిస్తున్నారు. పరీక్షలపై అవగాహన కోసం నమూనా ప్రశ్న పత్రాలను ప్రదర్శిస్తున్నారు. జిల్లాలో అధికారులు కూడా కొంత మంది విద్యార్థులకు కాల్ చేసి టీవీ తరగతులపై ఆరా తీస్తున్నారు.
మంచి స్పందన వస్తోంది
విద్యామృతం కార్యక్రమానికి విద్యార్థుల నుంచి మంచి సృందన వస్తోంది. ప్రతిరోజూ జిల్లాలో ఎంతమంది తరగతులను వీక్షించారో వివరాలు తెప్పించుకుంటున్నాం. పిల్లలు బాగా సాధన చేస్తున్నారు. ‘పది’లో మంచి ఫలితాలు వస్తాయనడానికి టీవీ తరగతులు ఎంతగానో దోహద పడుతున్నాయి- జనార్దనాచార్యులు, డీఈవో
ఇదీ చదవండి... ప్రభుత్వ పాఠశాలకు వైకాపా రంగులు