ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో సోమశిల జలాశయం పూర్తిస్థాయిలో జలకళ సంతరించుకోవడం ఆనందదాయకమని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. మొదటి నుంచి వ్యక్తిగతంగా ఆ ప్రాజెక్టు పురోగతిని పరిశీలిస్తూ వచ్చానన్నారు. ఆ తర్వాత భాగస్వామిగా సహకారాన్ని అందించానని, అందుకే సోమశిల ప్రాజెక్టు నిండటం మరింత సంతోషాన్ని అందించిందన్నారు. మొత్తం 78 టీఎంసీల సామర్థ్యంతో 5,84,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు పూర్తిగా నిండి అనుకున్న లక్ష్యాలకు అనుగుణంగా సాగునీరు అందించడం సంతోషదాయకమన్నారు.
ఉదయగిరి నియోజకవర్గానికి తాగు, సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన సోమశిల హైలెవల్ కాలువ నిర్మాణ పనులను ఈ మధ్యే సంబంధిత మంత్రిత్వశాఖలతో మాట్లాడి వేగవంతం చేయాలని సూచించానన్నారు. ఈ విషయమై ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ కూడా రాశానన్నారు. ఈ పనులు త్వరితగతిన పూర్తయి భవిష్యత్తులో ఈ ప్రయోజనాలు అక్కడి ప్రజలకు అందాలనేదే తన అభిలాష అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: