జీడీ నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలంలోని ఓ పంచాయతీలో ఈ పరిస్థితి నెలకొంది. పంచాయతీలో తొమ్మిది మంది నామపత్రాలు సమర్పించగా.. మంగళవారం ఒకరు పోటీ నుంచి తప్పుకొన్నారు. మరో ఇద్దరిని కూడా ఇదే తరహాలో ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. గతంలో ఓ కేసు విషయంలో తప్పుగా వ్యవహరించామని.. వచ్చేసారి ఈ పరిస్థితి పునరావృతం కానివ్వమని చెప్పారు. ఆ ఇద్దరూ కూడా మెత్తబడ్డారు. ఎక్కడ అధికార పార్టీ నాయకులు తమ వెంట పడతారో అని భావించి.. మిగతా అభ్యర్థులు తప్పించుకు తిరుగుతున్నారు.
నామినేషన్ల ఉపసంహరణకు గురువారం మధ్యాహ్నం 3 గంటల గడువు వరకు ఉండటంతో నాయకులు ఏకగ్రీవాల కోసం చర్చలు జరుపుతున్నారు. నారాయణవనం మండలంలో ఓ పంచాయతీలో అధికార పార్టీ మద్దతుదారుగా ఒకరు సర్పంచి బరిలో నిలబడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీగా అవకాశమిస్తామంటూ ఆ నాయకుడు హామీ ఇస్తున్నా.. నమ్మలేక పోటీలోనే ఉంటామంటూ ప్రత్యర్థి ప్రకటించారు. ఇదే మండలంలో ప్రస్తుతం తాము అధికారంలో ఉన్నందున.. సర్పంచి స్థానాలకు పోటీ నుంచి తప్పుకోవాలని కోరుతున్నారు. వచ్చేసారి సాధారణ ఎన్నికల్లో మీ పార్టీ విజయం సాధిస్తే.. మేం సర్పంచికి పోటీ చేయమని చెబుతున్నారు.
విజయపురం మండలంలో భూముల వ్యవహారంతో ముడిపెట్టి.. ఇప్పటికే కొందరు అభ్యర్థుల నామినేషన్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తిరస్కరించారు. అప్పీలుకు వెళ్లినా ఇదే పరిస్థితి ఎదురైంది. వెదురుకుప్పం మండల కేంద్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇద్దరు పోటీలో ఉన్నారు. ఒకరే అభ్యర్థిగా నిలబడేందుకు నాయకులు మంతనాలు చేస్తున్నా.. బుధవారం రాత్రి వరకూ చర్చలు కొలిక్కి రాలేదు. తొలి విడత ఎన్నికలు జరగనున్న చిత్తూరు డివిజన్‌లోని మండలాల్లో ఈ పరిస్థితి నెలకొంది.
ఇదీ చదవండి: