Two persons died : ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నారాయణ ఇంజినీరింగ్ కాలేజ్ హాస్టల్లో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వార్త విని వార్డెన్ గుండెపోటుతో మృతి చెందాడు. రెండో సంవత్సరం సీఎస్సీ చదువుతున్న పులివెందులకు చెందిన ధరణేశ్వర్ రెడ్డి అనే విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సహచర విద్యార్థులు.. విద్యార్థి ఆత్మహత్య విషయాన్ని హాస్టల్ వార్డెన్ శ్రీనివాసులు నాయుడుకు తెలిపారు. షాక్‌కు గురైన వార్డెన్ కుప్పకూలిపోయాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అల్లూరి జిల్లాలో ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఒక లారీ క్రేన్ కు సంబంధించిన మెటీరియల్‌తో అరకు నుండి బయలుదేరి నందపూర్, సిమ్లిగూడ మీదగా ఖుర్దా వెళ్లడానికి గాను సుంకి ఘాటి మీదగా వస్తూ పి కోనవలస చెక్ పోస్ట్‌కు సుమారు కిలో మీటర్ దూరంలో అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒడిస్సా రాష్ట్రానికి చెందిన డ్రైవర్ అభయ్ కుమార్ సాహు తీవ్ర గాయాలు పాలవ్వగా 108 ద్వారా ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించాడు. అందులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి చిన్నపాటి గాయాలయ్యాయి. దీని మీద పాచిపెంట ఎస్.ఐ ఎం. వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం నేరేడుచర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థినులు మృతి చెందారు. రాచర్ల నుంచి నేరేడుచర్లకు వెళుతున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో.. నేరేడుచర్లకు చెందిన పదో తరగతి విద్యార్థిని రజిని, ఎనిమిదో తరగతి విద్యార్థిని షాహిదాబీ మరణించారు. పాఠశాల నుంచి మరికొద్దిసేపట్లో ఇంటికి చేరుకోవాల్సిన విద్యార్థినులు మృత్యువాతపడటంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.
ఇవీ చదవండి: