వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిందితుడిగా ఉన్న కేసు ఆధారాలు నెల్లూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి చోరీకి గురైన ఘటనను ఏపీ హైకోర్టు సుమోటో పిల్‌గా స్వీకరించింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు సరైన దిశలో జరగడం లేదని, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి (పీడీజే) ఇచ్చిన నివేదికను ఆధారం చేసుకొని సుమోటో పిల్‌గా పరిగణించింది. మొత్తం 18 మందిని ప్రతివాదులుగా పేర్కొంది. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, సీబీఐ డైరెక్టర్, నెల్లూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, చిన్న బజార్ ఠాణా ఎస్‌హెచ్‌వో, నెల్లూరు (గ్రామీణ) ఠాణా ఎస్‌హెచ్‌వో, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్), నెల్లూరు జిల్లా జడ్జి (పీడీజే), నెల్లూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి, విజయవాడలోని ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి, పసుపులేటి చిరంజీవి, టి.వెంకటకృష్ణ, జి.హరిహరన్, ఫిర్యాదిదారు (న్యాయస్థానంలో జూనియర్ అసిస్టెంట్) బచ్చలకూర నాగేశ్వరరావు ప్రతివాదులుగా ఉన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ పిల్‌పై విచారణ జరపనుంది.
ఇదీ నేపథ్యం..
తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి విదేశాల్లో రూ.వేల కోట్ల ఆస్తులున్నాయని 2017లో ఆరోపించిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. అందుకు ఆధారాలున్నాయంటూ కొన్ని పత్రాలు విడుదల చేశారు. ఆ పత్రాలన్నీ నకిలీవని సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఏ-1గా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేసి అభియోగపత్రం వేశారు. దీనికి సంబంధించిన కేసు ప్రాపర్టీ నెల్లూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి ఈనెల 13వ తేదీ రాత్రి దొంగతనానికి గురైన ఘటన సంచలనం కలిగించిన విషయం తెలిసిందే.
పీడీజే నివేదికలో అంశాలివి..
ఈ చోరీపై నెల్లూరు పీడీజే ఈనెల 15న హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. నిందితులు పగలగొట్టిన తలుపుపై ఉన్న వేలిముద్రలు, ఘటనా స్థలంలో పాదముద్రలను పోలీసులు సేకరించలేదని అందులో తెలిపారు. డాగ్ స్వ్కాడ్‌ను పిలవలేదన్నారు. ఈ కేసులో దర్యాప్తు సరైన దిశలో జరుగుతున్నట్లు కనిపించడం లేదని వివరించారు. స్వతంత్ర సంస్థ దర్యాప్తు చేస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. ఈ వ్యవహారాన్ని సుమోటో పిల్‌గా మార్చాలని రిజిస్ట్రీని ఆదేశించారు.
కోర్టుకు హాజరైన సోమిరెడ్డి
విజయవాడ న్యాయవిభాగం, న్యూస్‌టుడే: మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి తనపై ఆరోపణలు చేశారన్న తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పిటిషన్‌పై సోమవారం విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమిరెడ్డి కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కాకాణి కోర్టుకు హాజరుకావడం లేదని ఆరోపించారు. మే 13న మంత్రితో పాటు నలుగురు నిందితులు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించిందని తెలిపారు.
ఇదీ చదవండి: కోర్టుల నుంచి ఆధారాలు చోరీ అయితే విచారణ ఎలా?