గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన పనులను వైకాపా సర్కారు నిర్లక్ష్యం చేస్తుందని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శించారు. నెల్లూరు నగరంలోని పార్కులు, సంతపేట మార్కెట్ పనులను తెదేపా నేత పట్టాభి రామరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పరిశీలించారు. నగరంలో మాజీ మంత్రి నారాయణ 5,200 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో చాలావరకు వైకాపా ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు.
సంతపేట మార్కెట్‌ను ఏడాదిగా నిలిపివేయడంతో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. పార్కులు సైతం నిర్వహణ లేకపోవడంతో దారుణంగా తయారయ్యాయని చెప్పారు. భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పథకం పనులను నిలిపివేశారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఈ పనులన్నీ ఆపేశారని దుయ్యబట్టారు. ప్రస్తుతం నిలిపివేసిన పనులను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పూర్తి చేయించేందుకు కృషి చేస్తామన్నారు.