Stone pelting at sea: నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లి సముద్రతీరంలో.. తమిళనాడు మత్య్సకారులు స్థానిక మత్య్సకారులపై రాళ్ల దాడి చేశారు. తమిళనాడు కడలూరు నుంచి జాలర్ల బోట్లు.. ఆంధ్ర తీర ప్రాంతంలోకి రావటంతో.. ఇసుకపల్లి మత్స్యకారుల వలలు తెగిపోయాయి. అక్రమచొరబాటు వల్ల వలలు తెగిపోయాయని ఇసుకపల్లి జాలర్లు తమిళనాడు మత్స్యకారులను ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన తమిళనాడు జాలర్లు.. ఇసుకపల్లి మత్స్యకారులపై రాళ్లదాడి చేయటంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. తమిళనాడు జాలర్లపై దాడి చేసేందుకు ఇసుకపల్లి జాలర్లు గాజు సీసాలు, రాళ్లు తీసుకుని సముద్రంలోకి వెళ్లారు. దీంతో ఉద్రిక్తత దృష్ట్యా ఇసుకపల్లి కోస్ట్ గార్డ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉదయం నుంచి ఇంత జరుగుతున్నా.. ఏ ఒక్క అధికారి తమను పట్టించుకోలేదంటూ మత్స్యకార కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. తమిళనాడు జాలర్ల నుంచి రక్షణ కల్పించాలంటూ.. పెద్ద ఎత్తున మెరైన్ పోలీస్ స్టేషన్ ముందు మత్స్యకారులు బైఠాయించారు. తమిళనాడు జాలర్లు తమపై దాడి చేస్తుంటే మీరేం చేస్తున్నారు.. పోలీస్ స్టేషన్ మా గ్రామానికి అవసరం లేదంటూ మెరైన్ ఎస్ఐ నాయబ్ రసూల్‌ను నిలదీసి నినాదాలు చేశారు.
నిషేధిత వలలతో చేపల వేట.. సోమశిల జలాశయం నెల్లూరు జిల్లాలో ఉంది. అయితే జలాశయ వెనక జలాలు మాత్రం ఉమ్మడి కడప జిల్లాలో విస్తరించి ఉన్నాయి. 22 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న.. ఈ జలాల్లో నిషేధిత వలలతో చేపల వేట కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన జాలర్లు నిషేధిత వలలను వినియోగించి చేపల వేట కొనసాగిస్తున్నారు. చిన్న రంధ్రాలు కలిగిన వలలను వినియోగించి.. చిరు చేపలను వేటాడుతున్నారు. స్థానిక వైఎస్సార్సీపీ నేతల అండదండలతోనే ఈ అక్రమ వేట కొనసాగుతోందని సమాచారం.
చేపల వేటకు సరిహద్దు వివాదాలు.. సముద్రంలో చేపల వేటకు సంబంధించి సరిహద్దు వివాదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. విశాఖ, విజయనగరం జిల్లాల మత్స్యకారుల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు లంగరు వేసిన పడవల్లో వలలు మాయమయ్యేవి. తాజాగా భోగాపురం మండలం చోడిపల్లిపేట తీరంలో ఓ బోటుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెటారు. ఇదే గ్రామానికి చెందిన ఎరుపల్లి పోలీసు సాయంత్రం వేట ముగించుకొని ఇంజిన్ బోటుకు లంగరు వేసి ఒడ్డుకు చేరుకున్నారు. అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో సముద్రంలో అగ్నికీలలు కనిపించడంతో మత్స్యకారులు అప్రమత్తమై రెండు పడవలపై అక్కడికి చేరుకున్నారు. అప్పటికే పైభాగం కాలిపోయింది. చెక్కతో పాటు వలలు దగ్ధమవడంతో రూ.20 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. ఇది ప్రమాదమా లేక ఎవరైనా నిప్పుపెట్టారా అన్నది తెలియాల్సి ఉంది.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు.
చేపల వేటపై నిషేధం.. తూర్పు తీరంలో ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి చేపల వేటపై నిషేధం విధిస్తూ కేంద్ర మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 15వ తేదీ అర్ధరాత్రి నుంచి మళ్లీ వేట ప్రారంభించవచ్చని సూచించింది. మొత్తం 61 రోజుల పాటు నిషేధం అమల్లో ఉండనుంది. కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ రాష్ట్ర మత్స్యశాఖ నుంచి ఎటువంటి మార్గదర్శకాలు రాలేదు. అవి రాగానే జిల్లా మత్స్యశాఖ అధికారులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
ఇవీ చదవండి: