పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. నెల్లూరు జిల్లాలో విద్యార్థి జేఏసీ ఆందోళన చేపట్టింది. నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద జేఏసీ నాయకులు ధర్నా చేపట్టి, నిరసన వ్యక్తం చేశారు. కరోనా విజృంభిస్తుండటంతో పరీక్షలు రద్దు చేయాల్సిన అవసరముందని డిమాండ్ చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేసినా, వైకాపా ప్రభుత్వం మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరించటం బాధాకరమని జేఏసీ నేత సాయి అన్నారు. కరోనా తీవ్రత వల్లే సీఎం జగన్ తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారానికి రావడం లేదని ప్రకటించారని, ప్రచారానికే రాని పరిస్థితుల్లో పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. విద్యార్థులు కరోనా బారిన పడితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం మొండిగా పరీక్షలు నిర్వహించాలని చూస్తే అడ్డుకుంటామని, విద్యాశాఖ మంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'అక్కాచెల్లెమ్మలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది'