నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నందిపాడులో జరిగిన వాల్మీకి బోయ ఆత్మీయ సభకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, స్థానిక ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చే విషయంపై ఇప్పటికే సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. ఈ విషయంపై కేంద్రంతో కూడా చర్చించనున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ నవరత్నాలు పథకాలు ద్వారా రాష్ట్ర ప్రజలకు స్వర్ణయుగం లాంటి పరిపాలన అందిస్తున్నారని వివరించారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని మంత్రి అన్నారు. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఉదయగిరి ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమ ఏర్పాటు చేసిన కార్మిక శాఖ ద్వారా పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంత్రి జయరాం, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలను వాల్మీకి సంఘం నాయకులు గజమాలతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.
ఇదీ చదవండీ...