స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ వ్యవహరించిన తీరుకు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. నెల్లూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన, పోటీ చేసిన అభ్యర్థులను సన్మానించారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామంటున్న వైకాపా నేతలు... ఎన్నికల్లో ఓటర్లకు నగదు పంపిణీ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి నెలకు రూ. 300 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని వైకాపాపై విమర్శలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని సోము వీర్రాజు వెల్లడించారు. పెట్రోల్‌పై వచ్చే పన్నులతో దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే, వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తుందని దుయ్యబట్టారు. అభివృద్ధిని విస్మరించి అవినీతిలో పోటీపడే వైకాపా, తెదేపాలకు రానున్న ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం నేర్పుతారని హితవు పలికారు. భాజపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేస్తే పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఏపీ వైఖరి వల్ల రైల్వే ప్రాజెక్టులపై తీవ్ర వ్యయభారం: రైల్వే మంత్రి